వద్దన్నా ఆయనే ఉపరాష్ట్రపతి అభ్యర్ధి

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి చేపట్టేందుకు ఏమాత్రం ఆసక్తి చూపకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ ఆయననే ఎన్డీయే అభ్యర్ధిగా ఖరారు చేశారు. సోమవారం సాయంత్రం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తే రాజ్యసభ చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారనె సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్షాలదే పైచెయ్యిగా ఉంది. కనుక సీనియర్ పార్లమెంటేరియన్, సుదీర్గ రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న వెంకయ్య నాయుడుకి రాజ్యసభ బాధ్యతలు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు.  

కనుక వెంకయ్య నాయుడు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం తన కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేస్తారు. రేపు ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఎన్డీయే కూటమికి ఆయనను గెలిపించుకొనేందుకు తగినంత మెజార్టీ ఉంది కనుక ఆయన ఉపరాష్ట్రపతి కావడం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు.

ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి కావడం తెలుగు వారందరికీ సంతోషమే కానీ ఆయన కేంద్రమంత్రిగా ఉండి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ సేవ చేయగలిగిఉండేవారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వెంకయ్య నాయుడు ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలకు మంత్రిగా ఉన్నారు. అయన రాజీనామా చేస్తే ఆ పదవులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరికైనా దక్కితే బాగుంటుంది.