
వైకాపా ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి ఆకస్మిక మృతితో ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానానికి త్వరలో ఉపఎన్నికలు జరుగనున్నాయి. దానిలో తెదేపా తరపున భూమా అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి, ఇటీవల తెదేపాకు గుడ్ బై చెప్పేసి వైకాపా చేరిన శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. నిజానికి ఈ ఉపఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ వాటిలో గెలువకపోతే రాజకీయ సన్యాసం చేస్తామని భూమా కుమార్తె మంత్రి అఖిల ప్రియ, శిల్పా మోహన్ రెడ్డి ఇద్దరూ సవాళ్లు విసురుకోవడంతో రెండు పార్టీలకు ఇవి ప్రతిష్టాత్మకంగా మారాయి.
కనుక ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఈ ఉపఎన్నికలలో తప్పకుండా విజయం సాధించడానికి ఏకంగా 12 మంది తెదేపా ఎమ్మెల్యేలను ఇన్ చార్జ్ లుగా నియమించారు. వారితో అయన ఆదివారం వారితో సమావేశమయ్యి ఈ ఉపఎన్నికలలో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి చాలాసేపు చర్చించారు. ఆ 12 మంది తెదేపా ఎమ్మెల్యేలు కాక ఇంకా కొంతమంది మంత్రులు, ఎంపిలు కూడా నంద్యాలలో తిష్టవేసి తెదేపా అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకొనేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశాలలో జగన్ వచ్చే ఎన్నికల కోసం 9హామీలను ప్రకటించినప్పుడు వాటిని ప్రజలు ఎవరూ నమ్మబోరని, వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ తమ పార్టీకే పట్టం కడతారని తెదేపా మంత్రులు చాలా మంది వాదించారు. కానీ నంద్యాల ఉపఎన్నికలలో వైకాపాను ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం గమనిస్తే ఆయన వైకాపా బలాన్ని తక్కువగా అంచనా వేయడం లేదని స్పష్టం అవుతోంది.
ఒకవేళ ఈ ఉపఎన్నికలలో వైకాపా గెలిస్తే భూమా అఖిలప్రియ మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం చేస్తే దాని వలన తెదేపాకు కొంత నష్టం జరుగుతుంది. ఏపిలో ప్రజలు తమవైపే ఉన్నారని జగన్ గట్టిగా చెప్పుకొనేందుకు కూడా అవకాశం లభిస్తుంది. అతనికి ఆ అవకాశం ఇవ్వడం ఇష్టం లేకనే చంద్రబాబు ఈ ఉపఎన్నికలను ఎదుర్కోవడానికి 12 మంది ఎమ్మెల్యేలను ఇన్ చార్జ్ లుగా నియమించారు. కనుక ఈ ఉపఎన్నికలు ఇంకా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇవి ఆ పార్టీల అభ్యర్ధుల మద్య కాక చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మద్య పరోక్షంగా జరుగుతున్న పోటీగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చూడాలి.