.jpg)
సిద్ధిపేటజిల్లాలో పర్యటిస్తున్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జిల్లాలో మర్కూక్ మండలంలో కొండపోచ్చం రిజర్వాయర్ నిర్వాసిత రైతులతో మాట్లాడిన తరువాత ములుగు మండలంలోని బైలంపూర్ గ్రామంలో నిర్వాసిత రైతులను కలుసుకొనేందుకు వెళ్ళినప్పుడు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనతో బాటు పర్యటిస్తున్న హైకోర్టు న్యాయవాది రచనారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డుకొనేందుకు గ్రామస్తులు ప్రయత్నించినప్పటికీ వారిని పక్కకు తప్పించి వ్యానులో స్టేషన్ కు తరలించారు.
భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 123 జిఓపై హైకోర్టు స్టే విధించిన తరువాత కేంద్రప్రభుత్వం సూచనల మేరకు కొత్త చట్టాన్ని రూపొందించి అమలు చేస్తోంది. దాని వలన భూసేకరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని, భూసేకరణ ప్రక్రియను ప్రతిపక్షాలు న్యాయస్థానాలలో అడ్డుకోలేవని తెరాస నేతలే స్వయంగా చెపుతున్నారు. భూసేకరణలో నిర్వాసిత రైతులందరికీ ఆమోదయోగ్యమైన ఆర్దికప్యాకేజి ఇస్తామని చెప్పుకొంటున్నారు. మరి అటువంటప్పుడు నిర్వాసిత రైతుల గోడు వినేందుకు వెళ్ళిన ప్రొఫెసర్ కోదండరామ్, రచనా రెడ్డి వంటి వారిని అరెస్ట్ చేయడం ఎందుకు? ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజితో రైతులు సంతృప్తి చెందుతున్నట్లయితే వారు ప్రొఫెసర్ కోదండరామ్ వారి మాటలు వినరు కదా? కానీ ఆయనను పోలీసులు అరెస్ట్ చేయబోతుంటే వారిని రైతులు అడ్డుకొన్నారంటే అర్ధం ఏమిటి? తద్వారా ప్రజలకు ఎటువంటి సందేశం వెళుతుంది? అనే ప్రశ్నలకు తెరాస నేతలే సమాధానం చెప్పవలసి ఉంటుంది.