ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లాలో అమర్ నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడిలో 7 మంది భక్తులు మరణించగా మరో 32 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం మళ్ళీ మరో విషాదకర సంఘటన జరిగింది. రాంబాణ్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై నచ్ లానా అనే ప్రాంతంలో అమర్ నాథ్ యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఆ ప్రమ్దాహంలో 16 మంది యాత్రికులు చనిపోయారు మరో 27 మంది గాయపడ్డారు. వీరిలో 19 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మృతులు, గాయపడినవారిలో యూపి, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, హరియాణా రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వారిలో తీవ్రంగా గాయపడిన 19మందిని ఆర్మీ హెలికాఫ్టర్లో జమ్మూలోని ఆసుపతరికి తరలించారు.
అమర్ నాథ్ యాత్రికుల బస్సులలో యాత్రికులకు రక్షణగా దారిపొడవునా బారీగా భద్రతాదళాలు మొహరించి ఉన్నందున ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, పోలీస్, వైద్య సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించగలిగారు. ఈ ఏడాదిలో ఇంతవరకు 16 బ్యాచ్ లు అమర్ నాథ్ యాత్రను పూర్తి చేసుకొన్నాయి. ఆదివారం బయలుదేరిన 17వ బ్యాచ్ కు చెందిన యాత్రికుల వాహనం ఈ ప్రమాదానికి గురైంది.