నేడు రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. సాధారణంగా ఏకాభిప్రాయంతో జరిగే రాష్ట్రపతి ఎన్నికలలో ఈసారి అధికార ఎన్డీయే, ప్రతిపక్ష యూపియే కూటములు తమతమ అభ్యర్ధులను నిలబెట్టడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఎన్డీయే తరపున రాంనాథ్ కోవింద్, యూపిఏ దాని మిత్రపక్షాల తరపున మీరా కుమార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి ఎన్నికలలో ఎంపిలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేసి ఎన్నుకొంటారు. ఎంపిలు అందరూ పార్లమెంటులో, ఎమ్మెల్యేలు తమ తమ రాష్ట్ర శాసనసభలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో ఓట్లు వేస్తారు. అన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయి.
ఈ ఎన్నికలలో ఎంపిల ఓట్లకు విలువ ఒకేలా ఉంటుంది. కానీ ఎమ్మెల్యేల ఓట్లకు ఆ రాష్ట్ర జనాభాను బట్టి తక్కువ లేదా ఎక్కువగా ఉంటుంది. కనుక యూపి, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలలో ఎమ్మెల్యేల ఓట్లకు విలువ ఎక్కువగా, కేరళ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం వంటి చిన్న రాష్ట్రాలలో తక్కువగా ఉంటుంది. ఎంపిలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు ముద్రించబడ్డాయి. కానీ అందరూ పోలింగ్ కేంద్రాల వద్ద అందించే ఊదా రంగు ప్రత్యేక పెన్నులను మాత్రమే వినియోగించవలసి ఉంటుంది.
ఈ ఎన్నికల ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకొని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎంపి, ఎమ్మెల్యేలకు ఏవిధంగా ఓట్లు వేయాలో ఇప్పటికే శిక్షణ ఇచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తెలంగాణా భవన్ లో తెరాస ప్రజా ప్రతినిధులు అందరికీ శిక్షణ ఇవ్వడమే కాకుండా మాక్ పోలింగ్ కూడా నిర్వహింపజేశారు. ఈరోజు ఉదయం మళ్ళీ మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించిన తరువాత అందరూ కలిసి నేరుగా అసెంబ్లీకి వెళ్ళి పోలింగులో పాల్గొంటారు. తెలంగాణా తెదేపా, భాజపా నేతలు ఆదివారం ఈ ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించుకొని అవగాహన పెంచుకొన్నారు. ఏపిలో తెదేపా, వైకాపాలు కూడా ఈ ఎన్నికల కోసం తమ తమ పార్టీల ప్రజాప్రతినిధులకు ఈరోజు ఉదయం శిక్షణ ఇచ్చిన తరువాత వెలగపూడిలోని అసెంబ్లీకి చేరుకొని పోలింగులో పాల్గొంటాయి. అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులను డిల్లీ తరలించి అక్కడే ఓట్లు లెక్కిస్తారు. ఈ నెల 20వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఈనెల 26తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగుస్తుంది కనుక ఒక రోజు ముందుగా అంటే 25వ తేదీన రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ప్రమాణస్వీకారం చేస్తారు.