కేసీఆర్ పై విహెచ్ పోలీస్ కంప్లైంట్

సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పిర్యాదు చేశారు. 

తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొన్న నాగరాజు అనే రైతు తన కుమార్తె నవ్య, మేనల్లుడు శ్రీనివాస్ లను వెంటబెట్టుకొని గురువారం హైదరాబాద్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలుసుకొని తమ గోడు మోరపెట్టుకొని సహాయం కోరడానికి వచ్చారు. కానీ ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలకు అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన వారు తమ వెంటతెచ్చుకొన్న పురుగుల మందు త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అప్పుడు సెక్యూరిటీ సిబ్బంది వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారి ముగ్గురి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం. 

వారిని కలవడానికి ముఖ్యమంత్రి అంగీకరించి ఉండి ఉంటే వారు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఉండేవారు కారని హనుమంతరావు వాదన. కనుక వారి ఆత్మహత్య ప్రయత్నానానికి కారకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ పై చట్ట ప్రకారం తీసుకోవాలని వి హనుమంతరావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శనివారం పిర్యాదు చేశారు. 

మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఇటువంటి సున్నితమైన అంశంపై కూడా హనుమంతరావు వంటి సీనియర్ నేత రాజకీయం చేయాలనుకోవడం చాలా శోచనీయం. ఒకవేళ ఆ రైతు కుటుంబంపై ఆయనకు నిజంగా అంత జాలిపడి ఉంటే ఆయన ముందుగా ఉస్మానియా ఆసుపత్రిలో చావుబ్రతుకుల మద్య ఊగిసలాడుతున్న వారిని పరామర్శించి, వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసి ఉండి ఉంటే బాగుండేది. 

ముఖ్యమంత్రిని కలిసేందుకు రోజూ కొన్ని వందల మంది వస్తుంటారు. వారిలో కొందరిని ఆయన కలువలేకపోవచ్చు. అంతమాత్రన్న ఆయన దోషి అని ఎవరూ అనలేరు. నాగరాజు వంటి పేదలను కలిసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ వారానికి లేదా నెలకు ఒకరోజు కేటాయిస్తే ఇటువంటి సంఘటనలు జరుగకుండా నివారించవచ్చు.