రైలులో సోలార్ కాంతులు

రైల్వే బోగీలలో లైట్లు, ఫ్యాన్లకు ఇంతవరకు విద్యుత్ లేదా డీజిల్ జనరేటర్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను వినియోగిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రైల్వే బోగీల పైభాగంలో సోలార్ ప్యానల్స్ బిగించిన ఒక డి.ఎం.యు. రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు డిల్లీలోని సఫ్దర్ గంజ్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం ప్రారంభించారు. రైలు బోగీలలో లైట్లు, ఫ్యాన్లకు అవసరమైన విద్యుత్ ఆ సోలార్ ప్యానల్స్ ద్వారానే అందుతుంది. రాత్రివేళలో సూర్యకాంతి లేనప్పుడు కూడా అవసరమైనంత విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా బ్యాటరీ వ్యవస్థను రూపొందించారు. 

ఉచితంగా లభించే ఈ సౌరవిద్యుత్ ని వినియోగించుకోవడం వలన ఆరు బోగీల డి.ఎం.యు. రైలులో సుమారు 21,000 లీటర్ల డీజిల్ మిగులుతుంది. ఏడాదికి 12 లక్షల లీటర్లు మిగులుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే దేశంలో మరిన్ని రైళ్ళకు ఈ సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. పర్యావరణానికి అనుకూలమైన సౌరవిద్యుత్, బయో టాయిలెట్స్, మురుగునీరు రీసైక్లింగ్ వంటి అనేక పద్దతులను రైల్వేలో ప్రవేశపెడుతున్నట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.