మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో అసభ్యంగా ప్రవర్తించి వార్తలకెక్కిన తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చేందుకు అయన శుక్రవారం ఎర్రవెల్లి ఫాంహౌస్ కు వచ్చారు. శంకర్ నాయక్ వచ్చినట్లు సెక్యూరిటీ సిబ్బంది ముఖ్యమంత్రికి తెలిపినప్పటికీ ఆయన నాయక్ ను కలవడానికి నిరాకరించారు. కనుక సెక్యూరిటీ సిబ్బంది నాయక్ ను లోపలకు అనుమతించలేదు. దానితో ఏమి చేయాలో పాలుపోక నాయక్ నిరాశగా వెనుతిరిగారు.
తెరాస పార్టీకి, తెరాస సర్కార్ కి అప్రదిష్ట కలిగించినందుకు శంకర్ నాయక్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉండటం సహజమే. ఈ ఒక్క ఘటనతో తెరాసలో గౌరవం కోల్పోయిన శంకర్ నాయక్ పార్టీలో కొనసాగడమూ కష్టమే..అలాగని విడిచిపెట్టినా ఇంకా కష్టమే. ఒకవేళ తెరాసలోనే ఉంటే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ వస్తుందో రాదో తెలియదు. పార్టీని విడిచిపెడితే అప్రదిష్టపాలైన ఆయనను ఏ పార్టీ చేర్చుకోకపోవచ్చు. చేర్చుకొన్నా మున్ముందు నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ పార్టీకి కూడా చెడ్డపేరు రావచ్చు. కనుక శంకర్ నాయక్ ఇప్పుడేమి చేస్తారో చూడాలి.
అధికార పార్టీలో ఉన్నామనే అహంకారంతో ప్రజా ప్రతినిధులు విర్రవీగితే ఏమవుతుందో అర్ధం చేసుకోవడానికి శంకర్ నాయక్ కేసు ఒక చక్కటి ఉదాహరణగా పనికివస్తుంది. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నట్లుగా ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలతో సత్సంబందాలు పెంచుకొని వారి ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తే వారికీ, పార్టీకి, ప్రభుత్వానికి కూడా మంచిది.