అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీ క్రింద ప్రేలుడు పదార్ధం!

యూపి శాసనసభలో ప్రతిపక్షనేత రామ్ గోవింద్ కుర్చీ క్రింద పెంటాఎరిథ్రిటోల్ టెట్రానైట్రేట్ (పి.ఈ.టి.ఎన్.) అనే ప్రేలుడు పదార్ధం కనుగొనడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 60-100 గ్రాములు బరువున్న ఆ పౌడర్ వంటి పదార్ధం పేలి ఉంటే శాసనసభలో చాలా మంది సభ్యులు చనిపోయుండేవారని ప్రేలుడు పదార్ధాల నిపుణులు చెపుతున్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున భవనం పరిసర ప్రాంతాలలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. అయినా దానిని ఎవరు ఎలాగ లోపలకు తీసుకువచ్చారో తెలియలేదు. ఈ సంగతి తెలియగానే ప్రేలుడు పదార్ధాల నిపుణులు అక్కడికి చేరుకొని ఆ పొడర్ ను భద్రంగా బయటకు తీసుకువెళ్ళారు. శాసనసభ లోపల, బయట, పరిసర ప్రాంతాలన్నీ బాంబ్ స్క్వాడ్స్ క్షుణ్ణంగా పరిశీలించి క్లియరెన్స్ ఇచ్చిన తరువాత ఈరోజు మళ్ళీ సమావేశాలు మొదలయ్యాయి. 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్.ఐ.ఏ.చేత దర్యాప్తు జరిపించాలని నిర్ణయించారు. ఈరోజు నుంచి శాసనసభ సమావేశాలు ముగిసే వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసే మెటల్ డిక్టేటర్స్ కూడా ఈ ప్రమాదకరమైన పి.ఈ.టి.ఎన్. ప్రేలుడు పదార్ధాన్ని కనిపెత్తలేవు. తెలుపు రంగులో ఉండే దానికి ఎటువంటి వాసన ఉండదు కనుక ఎవరికీ అనుమానం కూడా రాదు.కనుక దానిని లోపలకు తీసుకురావడం సులువే. కానీ శాసనసభ లోపల పరిసర ప్రాంతాలన్నీ చోట్ల సిసి కెమెరాలున్న సంగతి తెలిసి ఎవరు ఇంత సాహసం చేశారో తెలియవలసి ఉంది. పోలీసు ఉన్నతాధికారులు సిసిటీవీ రికార్డులు, మెయిన్ గేట్ ఎంట్రీ రికార్డ్స్ అన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితుడు పట్టుబడటం ఖాయం.