తెలుగు సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాలను వాడుతున్నట్లు అనుమానిస్తున్న వారికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు వారి పేర్లు కూడా మీడియాకు పొక్కాయి. నోటీసులు అందుకొన్న సినీ ప్రముఖులలో దర్శకుడు పూరీ జగన్నాథ్, రవితేజ, అతని కారు డ్రైవరు శ్రీనివాస రావు, చార్మీ, ముమ్మైత్ ఖాన్, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, తనీష్, నందు, కెమెరా మ్యాన్ శ్యాం కె నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులున్నారు. మొత్తం 19 మందికి నోటీసులు పంపించగా వారిలో 10 మంది నోటీసులపై సంతకాలు చేసి తీసుకొన్నారని మిగిలినవారికి కూడా త్వరలోనే నోటీసులు అందిస్తామని మాదకద్రవ్యాల నిరోధక శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు.
నోటీసులు అందుకొన్న వారందరూ ఈ నెల 17-27 లోగా స్వయంగా తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎవరైనా సినిమా షూటింగ్ కారణంగా హాజరుకాలేమనుకొంటే ఆ విషయం వెంటనే తెలియజేయాలని, వీలైతే అధికారులే అక్కడికి వచ్చి వారిని విచారిస్తారని లేఖలలో పేర్కొన్నట్లు సమాచారం. సరైనకారణాలు చూపకుండా విచారణకు హాజరుకాని వారిపై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకొంటామని ఆ లేఖలలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముమ్మైత్ ఖాన్ వంటి కొందరు తారలు ముంబైలో ఉన్నందున వారికి అక్కడికే నోటీసులు పంపిస్తున్నామని తెలిపారు.
దీనిపై ఆర్ట్ డైరెక్టర్ చిన్నా మొదటిగా స్పందించారు. తనకు కనీసం సిగరెట్ త్రాగే అలవాటు కూడా లేదని కానీ తను డ్రగ్స్ సేవిస్తున్నట్లు అనుమానిస్తూ నోటీసులు పంపడం బాధాకరం అని అన్నారు.