నేడు అఖిలపక్ష సమావేశం..ఏమి సాధిస్తారో?

సిక్కిం సరిహద్దులో డొక్లాం వద్ద చైనాతో ఘర్షణ వాతావరణం, జమ్మూకాశ్మీర్ లో మళ్ళీ అదుపు తప్పుతున్న పరిస్థితుల గురించి ప్రతిపక్షాలతో చర్చించేందుకు కేంద్రప్రభుత్వం ఈరోజు డిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి హాజరుకావలసిందిగా కాంగ్రెస్ తో సహా అన్ని ప్రధానపార్టీలకు ఆహ్వానాలు పంపింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దేశభద్రత, సమగ్రతకు సంబంధించిన ఈ రెండు అంశాలలో ఇంతవరకు చోటుచేసుకొన్న పరిణామాలు, వాటిని అధిగమించేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రతిపక్షాలకు వివరించి వాటి అభిప్రాయాలు కూడా స్వీకరించి ముందుకు సాగడానికే కేంద్రప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. 

చైనా విషయంలో మోడీ సర్కార్ చాలా మెతకగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు అదుపుతప్పడం మోడీ సర్కార్ వైఫల్యమేనని ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి. కనుక జూలై 17 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఈ రెండు అంశాలపై ప్రతిపక్షాలు తమను గట్టిగా నిలదీయవచ్చునని గ్రహించిన మోడీ సర్కార్ ముందుగానే ఈ అఖిలపక్ష సమావేశంతో వాటిని కట్టి పడేయాలని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయకుండా విడిచిపెట్టవు. కనుక ఈ అఖిలపక్ష సమావేశంతో కొత్తగా సాధించేదేమీ ఉండకపోవచ్చు.