
అక్రమాస్తుల కేసులో జైలు పాలైన తమిళనాడు అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ మళ్ళీ వార్తలలోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరపన్న అగ్రహార జైలులో సేద తీరుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె రాష్ట్ర డిజి (ప్రిసన్స్) హెచ్.ఎస్.సత్యనారాయణ రావుకు, అతని సిబ్బందికి రూ.2 కోట్లు లంచం ఇచ్చారని ఆయన క్రింద పనిచేస్తున్న రాష్ట్ర ఐజి (ప్రిసన్స్) డి.రూప లిఖితపూర్వకంగా రాష్ట్ర పోలీస్ డిజిపి ఆర్.కె.దత్తకు పిర్యాదు చేశారు. డిజికి రూ.2 కోట్లు లంచం ముట్టడంతో శశికళకు జైలులో రాజభోగాలు జరుగుతున్నాయని ఆమె తన లేఖలో ఆరోపించారు. దీనిపై తక్షణం విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆమె కోరారు.
ఆమె ఆరోపణలను సత్యనారాయణ రావు ఖండించారు. ఆమె తనపై ఆరోపణలు చేశారు కనుక వాటిని నిరూపించవలసిన బాధ్యత ఆమెపైనే ఉందని అన్నారు. ఆమె పనితీరును సరిచేసుకోమని హెచ్చరించినందుకు ఆమె ఈవిధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తను స్వయంగా పరపన్న అగ్రహార జైలును సందర్శించానని కానీ ఐజి రూప చెపుతున్నట్లుగా జైలులో ఎటువంటి అవకతవకలు కనబడలేదని అన్నారు.
ఒక ఐజి, డిజి స్థాయి ఉన్నతాధికారులు ఈవిధంగా కీచులాడుకోవడం విచిత్రమే. ఇంతకాలం బయట రాజభోగాలు అనుభవించిన శశికళ జైలుకు వెళ్ళినప్పుడే తనకు రాజభోగాలు కావాలని కోర్టులో పిటిషన్ వేసింది. కానీ కోర్టు కొన్ని సౌకర్యాలను మాత్రమే అనుమతించింది. కనుక శశికళ డబ్బు విరజిమ్మి జైలులో రాజభోగాలు సమకూర్చుకొనే ప్రయత్నం చేసి ఉంటే ఆశ్చర్యమేమీ కాదు. ఆమె రాష్ట్ర డిఐజి స్థాయి అధికారికే రూ.2 కోట్లు లంచం ముట్టజెప్పడం నిజమైతే ఆమె సాధారణ మహిళ కాదని భావించవలసి ఉంటుంది. అత్తకు తగ్గ అల్లుడు ఆమె మేనల్లుడు దినకరన్. అతను అన్నాడిఎంకె ఎన్నికల చిహ్నం దక్కించుకొనేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ కే రూ.50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.