సినీ పరిశ్రమలో 11 మందికి ఎక్సైజ్ నోటీసులు జారీ?

తెలుగు సినీపరిశ్రమలో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు, నలుగురు దర్శకులు, ముగ్గురు హీరోలతో సహా మొత్తం 11 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. ముగ్గురు హీరోలలో ఇద్దరు ప్రముఖ నిర్మాతల కుమారులని సమాచారం.

హైదరాబాద్ లో స్టార్ హోటల్స్, పబ్బులు, కార్పోరేట్ కాలేజీలు, స్కూలు విద్యార్ధులకు, సినీ పరిశ్రమలో కొందరికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠా సభ్యులు కెల్విన్, అబ్దుల్ వహీబ్, అబ్దుల్ ఖుదూస్ తదితరులు ఇటీవల పట్టుబడిన సంగతి తెలిసిందే. వారిని పోలీసులు విచారించగా సినీ పరిశ్రమలో మత్తుమందులు సేవిస్తున్న వారి పేర్లను బయటపెట్టారు. వారందరినీ వారం రోజులలోగా తమ ముందు విచారణకు హాజరుకమ్మని ఆదేశిస్తూ ఎక్సైజ్ శాఖ అధికారులు బుదవారం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఎవరెవరికి నోటీసులు జారీ చేశారనే విషయాన్ని బహిర్గతం చేయలేదు. 

దీనిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, నిర్మాతలు అల్లు అరవింద్, ఏడిద శ్రీరామ్‌,సీనియర్ నటుడు నరేశ్‌, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు స్పందించారు. ఇంతవరకు ముంబైకి, బాలీవుడ్ కే పరిమితమైన డ్రగ్స్, రేవ్ పార్టీలు, పబ్ కల్చర్ అన్నీ ఇప్పుడు టాలీవుడ్ కు కూడా దిగుమతి కావడంపై అల్లు అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. సినీపరిశ్రమలో కొద్దిమంది వలన మొత్తం సినీపరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో మత్తు మందులకు అలవాటుపడిన వారి పేర్లు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ, సమాజంలో వారి గౌరవాన్ని, వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని చాలా సంయమనంగా వ్యవహరిస్తోందని కానీ దానిని అలుసుగా తీసుకొని వారు మత్తులో మునిగితేలుతున్నారని అల్లు అరవింద్ అన్నారు. ఇకపై ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిస్తే వారిని సినీపరిశ్రమ నుంచి బహిష్కరించడానికి కూడా వెనుకాడమని అన్నారు. సినీపరిశ్రమలో డ్రగ్స్ వాడకాన్ని గుర్తించి అదుపు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకొంటామని చెప్పారు. 

తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 30,000 మంది పనిచేస్తుంటే వారిలో కేవలం 10-15మంది వలన మొత్తం అందరికీ చెడ్డపేరు వస్తోందని శివాజీ రాజా అన్నారు. కనుక ఇకనైనా వారు ఈ దుర్వ్యసనం నుండి బయటపడేందుకు గట్టిగా ప్రయత్నించాలని కోరారు.