ఈరోజు కరీంనగర్ లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తన ప్రభుత్వం ఏ మంచి పని చేపట్టిన రాష్ట్రంలో ప్రతిపక్షాలు దానిని విమర్శిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల తమ ప్రభుత్వం యాదవులకు పంపిణీ చేసిన కొన్ని గొర్రెలు ప్రమాదంలో చనిపోతే, దానిని ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశాయని చెప్పారు. అధికారం కోసం అలమటించిపోతున్న ప్రతిపక్షాలు చేసే అటువంటి దుష్ప్రచారానని పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగారి తెలంగాణా సాధన కోసం తను నిర్దేశించుకొన్న లక్ష్యాలను వివరించారు. అవేమిటంటే..
1.రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు పారించడం.
2. ప్రతీగ్రామంలో ప్రతీ ఇంటికి త్రాగునీరు అందించడం.
3. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం.
4. అభివృద్ధి, సంక్షేమ పధకాలను సమాంతరంగా నిర్వహిస్తూ పేదలకు సహాయపడుతూనే, వ్యవసాయాన్ని, కులవృత్తులకు సహాయసహకారాలు అందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్ కు కృషి చేయడం.
రాష్ట్ర ప్రజలందరూ తన ప్రభుత్వానికి సహకరించినట్లయితే రాగల రెండేళ్ళలో రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మార్చేయగలుగుతామని కేసీఆర్ అన్నారు.