కరీంనగర్ పచ్చబడాలి: కేసీఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కరీంనగర్ లో మిడ్ మానేరు డ్యామ్ వద్ద మొక్క నాటి రాష్ట్రంలో 3వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ “తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఇక్కడి నుంచే పోరాటం మొదలుపెట్టి సాధించాను. కరీంనగర్ మేధోసంపత్తి కలిగిన ప్రాంతం. కనుక ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుందనే నమ్మకం నాకుంది. అందుకే ఈ ఏడాది ఇక్కడే హరితహారం కార్యక్రమం మొదలుపెట్టాను. జిల్లాలో మహిళలు అందరూ మొక్కల్ని నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలు తలుచుకొంటే సాధ్యం కానిది ఏమి ఉండదు. అందుకే నేను ఈ పని కోసం ప్రత్యేకంగా మహిళలు చొరవ తీసుకోవాలని అభ్యర్ధిస్తున్నాను.

మనం గట్టిగా పట్టుబట్టి తెలంగాణా సాధించుకొన్నాము. అలాగే రెండేళ్లలో రాష్ట్రంలో పచ్చదనం పెంచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. నేను ఎప్పుడైనా హెలికాఫ్టర్ లో పైనుంచి వెళుతుంటే చెట్లే కనబడాలి తప్ప ఊరు కాదు. పై నుంచి చూస్తే ఇది కరీంనగర్ పట్టనమా లేక అడివా? అనిపించేంతగా మీరు చెట్లు పెంచాలి. మనం కోట్లాడి తెలంగాణా సాధించుకొన్నాము. దానిని మనమే కష్టపడి మళ్ళీ బాగుచేసుకోవాలి. తెలంగాణా కోసం ఏవిధంగా కష్టపడ్డామో ఇప్పుడు మన రాష్ట్రంలో పచ్చదనం పెంచుకోవడానికి కూడా అదేవిధంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. కనుక మీ ఇంట్లో ఎంత మంది సభ్యులు ఉంటే అన్ని మొక్కలు నాటి కరీంనగర్ ను పచ్చదనంతో నింపాలి. హరితహారం అంటే అదేదో ప్రభుత్వ కార్యక్రమం అనుకోవద్దు. ఇది మన రాష్ట్రాన్ని, మన జిల్లాను మనమే బాగుచేసుకొనే కార్యక్రమం. ఇది మన అందరిది. కనుక అందరూ దీనిలో పాలుపంచుకోవాలి," అని అన్నారు.