
దేశంలో ఆవులు, ఎద్దులు, దూడలు, ఒంటెలు మొదలైన పశువుల అక్రమ రవాణా మరియు వాటిని వధించడంపై కేంద్రప్రభుత్వం నిషేదం విధించడం, దానిపై మద్రాస్ హైకోర్టు స్టే విధించడం అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా మద్రాస్ హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తూ పశువధ, రవాణా నిషేధంపై స్టే విధించింది.
ప్రజల ఆహారపు అలవాట్లను, అనేకమంది జీవన భ్రుతికి సంబంధించిన ఈ అంశంపై కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా నిషేధం విధించడం ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగించడమేనని పిటిషనర్లు సెల్వగోమతి, అసిక్ ఇలాహీ భావా వాదించారు. కనుక ఒకవేళ పశువధపై కేంద్రప్రభుత్వం నిషేధం విదించాలనుకొంటే తప్పనిసరిగా పార్లమెంటులో దానిపై చర్చించి, పార్లమెంటు ఆమోదంతోనే అటువంటి నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్లు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ పశువధ నిషేధంపై స్టే విదిస్తున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయంపై పునః సమీక్షించుకొని దానికి అవసరమైన మార్పులు చేర్పులు చేయడానికి ఆగస్ట్ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలనే కేంద్రం అభ్యర్ధనను సుప్రీంకోర్టు మన్నించి, రెండు పిటిషన్స్ ను కొట్టివేసింది.
పశువధ నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది కనుక మళ్ళీ నేటి నుండి దేశంలో పశువుల అక్రమ రవాణా, వధ జోరందుకోవచ్చు. కనుక వాటిని అడ్డుకొనేందుకు గోరక్షక్ దళాలు కూడా రంగంలో దిగితే, మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి భాజపా పాలిత రాష్ట్రాలలో పశువధపై నిషేధం అమలులో ఉన్నందున ఆ రాష్ట్రాలలో ఇటువంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది.