ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా మహాత్మాగాంధీ మనుమడు

కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం 18 ప్రతిపక్ష పార్టీల నేతలు ఈరోజు డిల్లీలో సమావేశమయ్యి తమ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా ఈ విషయం మీడియాకు తెలియజేశారు. 

గోపాలకృష్ణ గాంధీ 1946, ఏప్రిల్‌ 22న జన్మించారు. డిల్లీ యూనివర్సిటీలో ఎం.ఏ. చేశారు. ఆయన ఐఏఎస్ అధికారిగా చిరకాలం సేవలు అందించారు. ఆ తరువాత నార్వే, ఐర్లాండ్ దేశాలలో భారత రాయబారిగా పనిచేశారు. శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలలో భారత హైకమీషనర్ గా సేవలు అందించారు. 2004-2009 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన పేరును రాష్ట్రపతి పదవికి సూచించారు. కానీ ప్రతిపక్షాలు మీరా కుమార్ ను ఆ పదవికి ఎంపిక చేసి గోపాలకృష్ణ గాంధీని ఉప రాష్ట్రపతి పదవికి ఖరారు చేశాయి. 

రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిని ఎంపిక చేయడంలో ఊగిసలాడటం వలన మోడీ సర్కార్ చేతిలో ప్రతిపక్షాలు ఎదురుదెబ్బ తిన్నందున ఈసారి  ఉప రాష్ట్రపతి పదవికి ముందుగానే ప్రకటించేశాయి. అయితే వాటి అభ్యర్ధి గోపాలకృష్ణ గాంధీకి మోడీ సర్కార్ మద్దతు పలుకుతుందా లేక ఆ పదవికి కూడా తన అభ్యర్ధిని నిలబెడుతుందా అనేది త్వరలోనే తెలుస్తుంది. 

ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న హమీద్ అన్సారీ పదవీ కాలం ఆగస్ట్ 19తో ముగుస్తుంది. కనుక ఆ పదవికి ఆగస్ట్ 5న ఎన్నికలు జరుగుతాయి. ఎన్డీయే కూటమి తరపున పోటీ చేస్తున్న రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నికవడం లాంచనప్రాయమే కనుక కనీసం ఉప రాష్ట్రపతి పదవిని తమకు వదిలిపెట్టాలని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. మరి మోడీ సర్కార్ ఏమి చేస్తుందో చూడాలి.