ఆ కాలనీలను గ్రామ పంచాయితీలుగా మార్చండి

తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు సోమవారం సచివాలయంలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, తన శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం నిర్వహించారు. దానిలో ఆయన కొన్ని ఆసక్తికరమైన సూచనలు చేశారు. పులిచింతల, మిడ్ మానేరు తదితర సాగునీటి ప్రాజెక్టుల క్రింద నిర్వాసితులైన గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన నిర్వాసిత కాలనీలలో కనీస సౌకర్యాలు కల్పించడమే కాకుండా వాటినే గ్రామా పంచాయితీలు మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అతిముఖ్యమైన వ్యవసాయం, సాగునీరు, రెవెన్యూ శాఖలు పరస్పర అవగాహనతో పనిచేయకపోతే ఆశించిన లక్ష్యాలు చేరుకోలేమని కనుక ఆ మూడు శాఖల్ ఉన్నతాధికారులు తరచూ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతీ ప్రాజెక్టు క్రింద వాస్తవంగా సాగవుతున్న ఆయనకట్టును గుర్తించి నిర్ధారించడానికి రీ-లోకలైజేషన్ చేయాలని సూచించారు.

పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో విజయవంతంగా అమలవుతున్న ‘టెయిల్ టు హెడ్’ సాగునీటిసరఫరా పద్దతి పెద్దపల్లి మంచిర్యాల ప్రాంతాలలో కూడా విజయవంతం అయ్యింది కనుక ఇకపై అన్ని ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలలో ఇదే విధానం అమలుచేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను, జిల్లా కలెక్టర్లను కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కోరారు. సాగునీటి శాఖ అధికారులు అందరూ తమకు నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి గట్టిగా కృషి చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు.