
అమర్ నాథ్ యాత్రికులపై సోమవారం రాత్రి ఉగ్రవాదుల దాడి చేశారు. ఆ దాడిలో ఏడుగురు యాత్రికులు మరణించగా మరో 32 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 6 మంది మహిళలున్నారు.
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఖన్నాబల్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేసి సోమవారం రాత్రి సుమారు 8.30గంటలకు యాత్రికుల బస్సును చుట్టుముట్టి కాల్పులు జరిపారు.
ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 40 మంది యాత్రికులున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల దాడి నుంచి తప్పించుకొనేందుకు బస్సులో నుంచి బయటకు దూకిన యాత్రికులు ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. బస్సులో ఉన్న వారందరూ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారే. దాడి చేసిన వెంటనే ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ సంగతి తెలుసుకొన్న ఆర్మీ, వైద్యసహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడికి ముందు ఉగ్రవాదులు సమీపంలోని బంటిగూ అనే ప్రాంతంలో పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించగా వారు ఎదురుకాల్పులు జరుపడంతో అక్కడి నుంచి పారిపోయారు. భద్రతాదళాలు వారి కోసం గాలిస్తుండగానే వారు యాత్రికుల బస్సుపై దాడి చేశారు.
అమర్ నాథ్ యాత్రికులకు భద్రత కల్పిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్.అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, “ అమర్ నాథ్ యాత్రకు వచ్చే ప్రతీ బస్సు తప్పనిసరిగా ముందుగా అమర్ నాథ్ దేవస్థానం బోర్డు వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. బోర్డు అందించిన సమాచారం ప్రకారం ప్రతీ బస్సుకు రక్షణగా మా సి.ఆర్.పి.ఎఫ్.బలగాలు ఉంటాయి. కానీ దాడికి గురైన బస్సు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో దానికి రక్షణ లేదు. పైగా రాత్రి ఏడు గంటల తరువాత యాత్రికుల బస్సులు ప్రయాణించకూడదు. కానీ బస్సు డ్రైవర్ నిబంధనలకు విరుద్దంగా బస్సును నడిపించడం వలననే ఉగ్రవాదులు దాడి చేయగలిగారు,” అని తెలిపారు.
దేశంలో అన్ని ప్రాంతాల నుంచి అమర్ నాథ్ యాత్రకు ఏటా సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తుంటారు. 45 రోజుల పాటు సాగే ఈ యాత్రలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అవికాక ఉగ్రవాదులు కూడా ఈవిధంగా అమర్ నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఉగ్రవాదుల బారి నుండి యాత్రికులకు రక్షణ కల్పించడానికి సుమారు 40,000 మంది సి.ఆర్.పి.ఎఫ్.దళాలను మొహరించవలసి వస్తోంది. ఒక చిన్నపాటి యుద్దానికి సరిపోయేంతమంది సాయుధ బలగాలను మొహరించవలసి వస్తోందంటే అక్కడ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. అంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినప్పటికీ ఈవిధంగా ఏ చిన్న అవకాశం దక్కినప్పటికీ ఉగ్రవాదులు దాడులు యాత్రికులపై చేస్తూనే ఉన్నారు.
17 ఏళ్ళ క్రితం..అంటే 2000 సం.లో ఉగ్రవాదులు దాడి చేసి 30 మంది అమర్ నాథ్ యాత్రికులను పొట్టన పెట్టుకొన్నారు. అప్పటి నుంచి కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఇన్నేళ్ళుగా అమర్ నాథ్ యాత్ర సురక్షితంగా సాగిపోతోంది. కానీ ఒక బస్సు డ్రైవర్ చేసిన పొరపాటుకు 7మంది భక్తులు అన్యాయంగా బలైపోయారు.
విశేషం ఏమిటంటే ఈ ఉగ్రదాడి జరిగిన అనంతనాగ్ నియోజకవర్గానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దాడి గురించి తెలియగానే ఆమె తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు.