
తెరాస ఎంపి జితేందర్ రెడ్డి నిన్న మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ “శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి దక్కకుండా నేను అడ్డుపడ్డాననే ఆరోపణలలో నిజం లేదు. ఎవరైనా మంచి పని చేస్తే భుజం తట్టి ప్రోత్సహిస్తాను తప్ప నాకు ఎవరి పొట్ట కొట్టే అవసరం, అలవాటు రెండూ లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవేళ శ్రీనివాస్ గౌడ్ ను మంత్రిని చేయదలచుకొంటే నేను వద్దని చెపితే వింటారా? ఆయనకు ఎవరు ఎటువంటి వారో బాగా తెలుసు,” అని అన్నారు.
తెరాస సర్కార్ పై ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, “మా ప్రభుత్వ పాలనలో రెడ్లకు అన్యాయం జరిగిందని ఆయన నిశ్చితాభిప్రాయం. అందుకే మా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. నేను (జితేందర్ రెడ్డి) పార్లమెంటులో ఫ్లోర్ లీడర్ ని. మన పోలీస్ కమీషనర్ రెడ్డి. మన అడ్వకేట్ జనరల్ రెడ్డే. ఇంటలిజన్స్ లో నిన్నమొన్నటి వరకు ఉన్నదీ రెడ్డే. మొత్తం 18మంది మంత్రులలో 8 మంది రెడ్లే ఉన్నారు. ఇంకా రెడ్డి కులస్తులకు అన్యాయం జరిగిందని ఎందుకు భావిస్తున్నారో ఆయనకే తెలియాలి. అప్పటికీ నేను ఆయనను కలిసినపుడు కొంత కాలం వేచి చూడాలని (అంటే తెరాస సర్కార్ కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు భావించవచ్చు) కోరాను. కానీ ఆయన ‘అదేమీ కుదరదు.. మీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని యుద్ధం ప్రకటించేశారు. ప్రొఫెసర్ కోదండరామ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి వంటివారందరూ రాజకీయ నిరుద్యోగులు. అందుకే వారు ప్రజలను పోగేసి అల్లరి చేసి మా ప్రభుత్వంపై బురద జల్లాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు” అని జితేందర్ రెడ్డి అన్నారు.