బంగారి తెలంగాణా కాదు సమస్యల తెలంగాణా

సూర్యాపేట జిల్లాలో గరిడేపల్లిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇదివరకు తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనుల గురించి వివరించి వాటి వలన రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏవిధంగా లబ్ది పొందారో ఉత్తం కుమార్ రెడ్డి వివరించారు. 2019 ఎన్నికలలో గెలిచి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల చొప్పున రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేస్తున్న సంక్షేమ పధకాల ప్రకటనలు అన్నీ మాటలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలో కనబడటం లేదని అన్నారు. కేసీఆర్ పాలనలో బంగారి తెలంగాణా సాధన మాటేమో కానీ రాష్ట్రం అనేక సమస్యలలో మునిగిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాలన చేయడం చేతకాకపోవడంతో ఎప్పటికప్పుడు ప్రజలకు మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్యపెడుతూ రోజులు దొర్లించేస్తున్నారని ఉత్తం కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం గట్టిగా కృషి చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.