ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం దేశంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో డిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్ధిక, వ్యవసాయ, జలవనరులు, వైద్య ఆరోగ్యం, పరిశ్రమలు, విద్యా విద్యుత్ తదితర శాఖల ప్రధాన కార్యదర్శులు కూడా హాజరుకాబోతున్నారు.
గత మూడేళ్ళుగా కేంద్రప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అమలు, దేశవ్యాప్తంగా చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, వివిధ రంగాల అభివృద్ధిపై సమీక్ష, ఇక ముందు ఏవిధంగా ముందుకు సాగాలనే విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలు, జి.ఎస్.టి. అమలుపై ఈ సమావేశంలో లోతుగా చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమస్యలను కార్యదర్శులు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం లక్ష్యం రాష్ట్రాల మద్య పరస్పర సహాయసహకారాలు పెంపొందింపజేయడం, వాటి మద్య అభివృద్ధిలో పోటీతత్వం రగిలించడమని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.
రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సమావేశం కావడం చాలా అభినందనీయమైనదే కానీ ఈ సమావేశం ద్వారా అన్ని రాష్ట్రాలకు, దేశ ప్రజలకు మేలు కలిగించే మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని ఆచరణలోకి మార్చగలిగినప్పుడే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. లేకుంటే ఇది కూడా కేంద్రప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడానికి ఏర్పాటు చేసుకొన్న ఒక మొక్కుబడి సమావేశంగానే మిగిలిపోతుంది.