తెరాస ఎంపిలలో చాలా యాక్టివ్ గా ఉండేవారిలో జితేందర్ రెడ్డి కూడా ఒకరు. ఆయన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమం కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో భాజపాతో పొత్తుల గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు.
“2014 ఎన్నికలలో దేశమంతటా మోడీ ప్రభంజనం వీస్తుండటం గమనించి, భాజపాతో పొత్తులు పెట్టుకొంటే బాగుంతుందని మేము అనేకసార్లు కేసీఆర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాము. ఎందుకంటే వెలుగుతున్న సూర్యుడివైపు పయనిస్తే మంచిదనుకొన్నాము. కానీ కేసీఆర్ అందుకు ససేమిరా అంగీకరించలేదు. “రెడ్డీ.. మీరు ప్రజల మనసులో ఏముందో అర్ధం చేసుకోలేకపోతున్నారు. భాజపాతో మనకు పొత్తులు వద్దు. దానితో పొత్తులు లేకుండానే మనం ఘన విజయం సాధించబోతున్నాము,” అని చెప్పేవారు. చివరకు అదే నిజమయింది. ఒకవేళ అప్పుడు భాజపాతో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే ఈరోజు తెలంగాణా కోసం మేము ఇంత గట్టిగా కేంద్రంతో పోరాడగలిగే స్వేచ్చ మాకు ఉండేది కాదు కదా!” అని అన్నారు.
అప్పుడు భాజపాతో పొత్తులు పెట్టుకోవాలని పట్టుబట్టిన మీరే ఆ తరువాత నిజామాబాద్ తెరాస ఎంపి కవిత కేంద్రమంత్రి పదవి చేపట్టకుండా అడ్డుకొన్నారని వార్తలు వచ్చాయి..నిజమేనా?” అనే ప్రశ్నకు జితేందర్ రెడ్డి నవ్వేస్తూ “అటువంటి వార్తలు చాలా వస్తుంటాయి. కానీ నిజానిజాలు ఏమిటో మాకే తెలుసు. అప్పుడు ఏ కారణం చేత మేము భాజపాకు దూరంగా ఉన్నామో కవిత విషయంలోనూ అదే కారణాల చేత దూరంగా ఉన్నాము,” అని జితేందర్ రెడ్డి జవాబు చెప్పారు.