క్యాబ్ డ్రైవరే కిడ్నాప్ చేస్తే...

ఇప్పుడు దేశమంతా క్యాబ్ కల్చర్ బాగా పెరిగింది. ఆటో రిక్షాలకంటే తక్కువ ధరలో ఏసీ కారులో సుఖంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరే సౌకర్యం ఉన్నందునే అందరూ ఇప్పుడు క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. కానీ ఆ క్యాబ్ డ్రైవరే కిడ్నాప్ చేస్తే..రెప చేస్తే..?తలచుకొంటేనే భయం వేస్తుంది. అటువంటి ఘటనే తాజాగా డిల్లీలో జరిగింది. 

జోగులంబ గద్వాల్ జిల్లాకు చెందిన అక్కల శ్రీకాంత్ డిల్లీ మెట్రో ఆసుపత్రిలో పిజి చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతను ఆసుపత్రిలో విధులు ముగించుకొని ఆలా క్యాబ్ లో ఇంటికి తిరిగి వెళుతుండగా ఆ క్యాబ్ డ్రైవరే అతనిని కిడ్నాప్ చేశాడు. అతని తల్లి, తండ్రులకు ఫోన్ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ సమాచారం అందిన వెంటనే అతని తండ్రి, దగ్గర బంధువులతో కలిసి విమానంలో ఈరోజు డిల్లీ వెళ్ళారు. తమ కొడుకును కాపాడవలసిందిగా అతని తల్లితండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

శ్రీకాంత్ కిడ్నాప్ అయ్యి 48 గంటలు గడిచినా ఇంతవరకు అతని ఆచూకి లభించలేదు. డిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.  

గతంలో ఊబర్ క్యాబ్ డ్రైవర్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేశాడు. ఆ కారణంగా ఊబర్ సంస్థ తీవ్ర అప్రదిష్టపాలవడమే కాకుండా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఓలా డ్రైవర్ చేసిన ఈ నిర్వాకంగా కారణంగా ఆ సంస్థకు చెడ్డపేరు వచ్చింది.