
సాగునీరు విషయంలో అన్యాయం జరుగుతోందనే కారణంతోనే కేంద్రంతో కొట్లాడి తెలంగాణా రాష్ట్రం సాధించుకొంటే, ఇప్పుడు ప్రతిపక్షాల కారణంగా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేకపోతున్నాయని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలకు కాంగ్రెస్, తెదేపాలు అడుగడుగునా అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేయకుండా కోర్టులలో పిటిషన్లు వేయడం వలన పనులు ముందుకు సాగడం చాలా కష్టం అవుతోందని అన్నారు. తెలంగాణా రైతన్నలకు నీళ్ళు అందకపోతే ఆ పాపం ప్రతిపక్షాలదేనని మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని తమ ప్రభుత్వం ఎదుర్కొంటూ ముందుకు సాగుతోందని అన్నారు.
కేంద్రప్రభుత్వం భూసేకరణ చట్టానికి ఆమోదం తెలిపింది కనుక ఇకపై భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసి సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం అయ్యేందుకు తాను ప్రతీ 10 రోజులకు ఒకసారి ప్రాజెక్టులను సందర్శిశించి పనుల పురోగతిని సమీక్షిస్తానని ఎవరైనా కాంట్రాక్టర్లు పని సరిగా చేయకపోయినా, నాసిరకం పనులు చేసినా వారి సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతానని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. భూసేకరణలో ఎక్కడా రైతులకు అన్యాయం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని చెప్పారు.