తెరాస ఎన్డీయే కూటమిలో భాగస్వామికానప్పటికీ రాంనాథ్ కోవింద్ కు మద్దతు పలికినందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు తెరాస ఎంపి బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు.
“రాంనాథ్ కోవింద్ కు మేము ఎందుకు మద్దతు ఇచ్చామని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పాము. ఆయన దళితుడు, న్యాయకోవిదుడు. నిజానికి ఆయన పేరును ముఖ్యమంత్రి కేసీఆరే ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొనే మేము ఆయనకు మద్దతు ఇచ్చాము. అదేదో నేరమన్నట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం చాలా తప్పు. అసలు కాంగ్రెస్ పార్టీకి దళితులపై అంత ప్రేమ ఉన్నట్లయితే మీరా కుమార్ పేరును ముందుగానే ఎందుకు ప్రకటించలేదు?కోవింద్ పేరును ప్రకటించిన తరువాతే ప్రకటించడానికి కారణం కులరాజకీయాలు చేయడం కాదా? ఆమె ఓడిపోతుందని తెలిసి కూడా నిలబెట్టి బలిపశువును చేసి మళ్ళీ ఆమె దళిత అభ్యర్ధి అంటూ ఆమెపై ప్రేమ ఒలకబోయడం దేనికి? ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ ఆమెను పలుకరించలేదని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు, ఆమెకు విమానం తప్పిపోతే ఏమి చేశారు? అదే రాహుల్ గాంధీ అయితే ఏమి చేసేవారు?” అని ప్రశ్నించారు.
ఈ అంశంపై కాంగ్రెస్, తెరాస నేతల వాదోపవాదాలను పక్కన బెడితే అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీగా తెరాస తమ పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మేలు కలిగించే ఎటువంటి నిర్ణయమైనా తీసుకొనే హక్కు ఉంటుంది. దానిని ఎవరూ ప్రశ్నించలేరు. రాష్ట్రంలో తమకు బద్ధ విరోధి అయిన తెదేపాతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడానికి సిద్దపడితే తప్పుకానప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెరాస భాజపా అభ్యర్ధికి మద్దతు ఇస్తే తప్పెందుకు అవుతుంది?