
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ డెయిరీ పాల వాహనంలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా తిరుపతిలో అటవీశాఖ సిబ్బంది పట్టుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
తిరుపతిలోని శేషాచలం అడవులలో ఎర్రచందనం సగ్లర్లను పట్టుకోవడానికి అటవీశాఖ సిబ్బంది వెళ్ళినప్పుడు వారిపై స్మగ్లర్లు రాళ్ళతో దాడులు చేశారు. అప్పుడు అటవీశాఖ సిబ్బంది తమ వద్ద ఉన్న తుపాకులతో గాలిలో కాల్పులు జరుపగా వారు పారిపోయారు. ఆ ప్రాంతంలో హెరిటేజ్ డెయిరీ పాల వాహనం (నెంబర్: ఏపి 26, టిసి 4187) ను చూసి అటవీశాఖ సిబ్బంది షాక్ అయ్యారు. దానిని తనికీ చేయగా ఆ వాహనంలో సుమారు రూ. 2 కోట్లు విలువగల 71 ఎర్రచందనం దుంగలు కనబడ్డాయి. వాటిని, ఆ వాహనాన్ని వారు స్థానిక పోలీసులకు అప్పగించారు.
గతంలో ఎర్రచందనం సగ్లర్లు తిరుపతి వెంకన్న దర్శనం కోసం బయలుదేరిన భక్తుల బృందంలా ఒక బస్సులో వచ్చారు. అప్పుడు ఆకస్మిక తనికీలలో బస్సులో దాచిన కత్తులు గొడ్డళ్ళు దొరికిపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ పాల వాహనంలో ఎర్ర చందనం దుంగలను రవాణా చేసినట్లయితే ఎవరికీ అనుమానం రాదని భావించారు.
ఆ వాహనం టి.ఎన్.18ఎం 8996 నెంబరుతో నెల్లూరుకు చెందిన ముస్తాక్ అహ్మద్ పేరిట రిజిస్టర్ అయ్యింది. దానిని అతను ఆరు నెలల క్రితమే కలికిరికి చెందిన మహేష్ అనే వ్యక్తికి అమ్మవేసినట్లు పోలీసులు గుర్తించారు. దానినే ఎర్ర చందనం స్మగ్లర్లు దొంగిలించి దానిపై హెరిటేజ్ డెయిరీ పేరు, నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్ వ్రాసి తెచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ వారు ఆ వాహనంతో అటవీ ప్రాంతం దాటి నగరంలోకి ప్రవేశించగలిగి ఉండి ఉంటే ఇక ఎవరూ దానిని అపేవారే కాదు. కానీ వారి దురదృష్టం కొద్దీ అడవిలోనే ఆ వాహనం పట్టుబడిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.