సమైక్యరాష్ట్రంలో ఎన్జీవోలు హైదరాబాద్ లో నిర్మించుకొన్న ఎన్జీవో భవన్ పై ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణా ఎన్జీవోల మద్య వివాదం మొదలైంది. దానిని పూర్తిగా తమ నిధులతోనే నిర్మించుకొన్నామని, తెలంగాణా ఎంజీవోలు సాటి ఉద్యోగులనే కారణం చేత వారిని కూడా ఎన్జీవో సంఘంలో భాగస్వాములుగా చేర్చుకొన్నామని కనుక ఎన్జీవో భవన్ పై తెలంగాణా ఎన్జీవోలకు ఎటువంటి హక్కులు ఉండవని ఏపి ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వాదిస్తున్నారు.
ఎన్జీవో భవన్ లో కొంత భాగాన్ని భాగ్యనగర్ టీ-ఎన్జీవోలకు కేటాయిస్తూ తెలంగాణా ప్రభుత్వం జూన్ 24న ఉత్తర్వులు జారీ చేయడంతో అశోక్ బాబు మరి కొంతమంది ఎన్జీవో సంఘం నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్, తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్యదర్శికి దీని కోసం వినతి పత్రాలు ఇచ్చారు.
అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, “దీనిపై హైకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. తెలంగాణా ఎన్జీవోలకు మా భవనంలో భాగం కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కోర్టు తీర్పు కాపీలను గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, తెలంగాణా రెవెన్యూ శాఖ కార్యదర్శికి సమర్పించి తక్షణమే తగు చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశాము,”అని చెప్పారు.
అశోక్ బాబు వాదనలను భాగ్యనగర్ టీ-ఎన్జీవో సంఘం నేతలు ఖండించారు. ఆయన ఇరురాష్ట్రాల ఎన్జీవోలను, తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏపిఎన్జీవో సంఘంలో గత 40 ఏళ్లుగా తెలంగాణా ఎన్జీవోలు సభ్యులుగా ఉన్నారని, కానీ అశోక్ బాబు తమకు సంఘంలో ఎటువంటి పాత్ర, ప్రాధాన్యం లేదన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఎన్జీవో భవన్ లో తమకు కూడా వాటా ఉందని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిందే తప్ప కొట్టివేయలేదని కానీ అశోక్ బాబు కోర్టు కొట్టివేసిందని చెపుతూ తెలంగాణా ప్రభుత్వాన్ని తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తునారని వారు ఆరోపించారు. ఎన్జీవో భవన్ లో న్యాయంగా తమకు దక్కవలసిన భాగాన్ని పోరాడి సాధించుకొంటామని అన్నారు.