కేసీఆర్ అలాగ చేయడం తప్పే...నా?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఘనస్వాగతం పలికి చాలా హడావుడి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, అంతకు ముందు రోజు విపక్షాల అభ్యర్ధి మీరా కుమార్ వచ్చినప్పుడు ఆమెను అసలు పట్టించుకోలేదు. ఆమెకు మద్దతు ఇవ్వదలచుకోకపోయినా దేశంలోకెల్లా అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి లేదా అయన ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి ఉండి ఉంటే బాగుండేది. కానీ ఆమె స్వయంగా ఫోన్ చేసినా కేసీఆర్ స్పందించలేదు.

కేసీఆర్ తీరు పట్ల కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు, పొన్నాల ప్రభాకర్, సర్వే సత్యనారాయణ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “రాంనాథ్ కోవింద్ ఏమైనా తాతల కాలం నుంచి కేసీఆర్ కు పరిచయం ఉన్నారా?ఆయనకు అన్ని మర్యాదలు చేశారు? ఆయనకు మర్యాదలు చేస్తే తప్పు కాదు కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి ఎంతో సహకరించిన మీరా కుమార్ హైదరాబాద్ వస్తే పలుకరించలేరా? కనీసం ఆమె ఫోన్ చేసినప్పుడైన మాట్లాడొచ్చు కదా? మన రాష్ట్రానికి సాయం చేసిన మహిళ వస్తే ఇలాగేనా ముఖ్యమంత్రి వ్యవహరించేది? ఇదేనా మన తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు? ఆమెను అవమానించడం మనల్ని మనం అవమానించుకోవడమే. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరు సరికాదు,” అని అన్నారు. 

“మీరా కుమార్ ప్రతిపక్షాల అభ్యర్ధి. తెరాస కూడా ప్రతిపక్ష పార్టీయే తప్ప ఎన్డీయే భాస్వామి కాదు. మరి అటువంటప్పుడు మీరా కుమార్ కు మద్దతు ఇవ్వకుండా రాంనాథ్ కోవింద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు? సిబిఐ  కేసులకు.. ప్రధాని నరేంద్ర మోడీకి భయపడేనా?” అని ప్రశ్నించారు పొన్నాల ప్రభాకర్, సర్వే సత్యనారాయణ.