నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది జంప్!

రాష్ట్ర విభజన తరువాత ఏపిలో కాంగ్రెస్ పార్టీ దాదాపు భూస్థాపితం అయిపోయింది. దానిని ఈజిప్ట్ మమ్మీతో పోల్చారు వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఈజిప్ట్ మమ్మీ, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నడూ పునర్జీవించలేవని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ నగర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మంగళవారం సాయంత్రం హటాత్తుగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి మరో 10 రోజుల్లో వైకాపాలో చేరిపోతున్నట్లు ప్రకటించారు.

ఒకప్పుడు ఆయనకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలిగేవారు కనుక ఇప్పుడు జగన్ తో తేలికగానే సర్దుకుపోవచ్చునని భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడకపోవడంతో ఇప్పటికే చాలా మంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయారు. కనుక మల్లాది వెళ్ళిపోయినా కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదనే భావించవచ్చు.

సుమారు ఏడాది క్రితం విజయవాడలో స్వర్ణా బార్ లో కల్తీ మద్యం త్రాగి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మల్లాది విష్ణు కుటుంబ సభ్యులే ఆ బార్ యజమానులు కావడంతో ఆ కేసులో పోలీసులు ఆయనతో సహా వారందరిపై కేసులు నమోదు చేశారు. అప్పుడు కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కేసు సంగతి ఏమయిందో...దానిలో దోషులుగా ఎవరిని నిర్దారించారో...ఎవరికీ తెలియదు.