ఈరోజు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు తెలంగాణా ప్రభుత్వం తరపున మంత్రులు, ఎంపిలు ఘనస్వాగతం పలికారు. జలసౌధాలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, “మీరే త్వరలో రాష్ట్రపతి కాబోతున్నారనేది సుస్పష్టం. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొంది. నేటికీ ఇంకా ఎదుర్కొంటూనే ధైర్యంగా ముందుకు సాగుతున్నాము. కొత్తగా ఏర్పడిన మా తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మీ ఆశీర్వచనాలు, తోడ్పాటు చాలా అవసరం,” అని అన్నారు.
రాంనాథ్ కోవింద్ కూడా కేసీఆర్ ను ప్రశంశలతో ముంచెత్తారు. "రాష్ట్రపతి పదవికి నా పేరు ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు తెరాస నాకు అండగా నిలబడింది. ఎన్డీయే కూటమికి చెందని పార్టీలలో తెరాసయే నాకు మొట్టమొదట మద్దతు పలికింది. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా కృతజ్ఞతలు. నాకు అర్ధమయ్యేందుకు ఆయన హిందీలో మాట్లాడినందుకు, నన్ను స్వాగతిస్తూ నగరంలో బ్యానర్లు పెట్టినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. బిహార్ గవర్నర్ గా పనిచేసినప్పుడు పార్టీలకు అతీతంగా ఏవిధంగా పనిచేశానో ఇప్పుడూ అదేవిధంగా పనిచేస్తాను,” అని అన్నారు.
కేంద్రప్రభుత్వం రాంనాథ్ కోవింద్ పేరు ప్రకటించగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఆలోచన లేకుండా ఆయనకు మద్దతు పలుకడమే కాకుండా ఆయనకు హైదరాబాద్ లో ఘనస్వాగతం పలికి ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనబడుతూనే ఉంది. అందుకు ఆయన చాలా ప్రసన్నం అయినట్లు అయన మాటలలోనే బయటపడింది. ఆయనే ఎలాగూ రాష్ట్రపతి కాబోతున్నారని గ్రహించిన కేసీఆర్ ఆయనకు బేషరతు మద్దతు పలికి ఇప్పుడే ఆయనతో బలమైన స్నేహసంబంధం ఏర్పరచుకొనే ప్రయత్నం చేయడం కేసిఆర్ దూరదృష్టికి, రాజనీతిజ్ఞతకి చక్కటి నిదర్శనం.