జి.ఎస్.టి.పై భిన్నాభిప్రాయాలేల?

జి.ఎస్.టి.పై వ్యాపారులకు, ప్రజలకు అవగాహన లేకపోతే సహజమే. దానిని అమలుచేయవలసిన అధికారులకు అవగాహన లేకపోయినా అర్ధం చేసుకోవచ్చు కానీ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను నియంత్రిస్తున్న ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ దానిపై పూర్తి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది.

జి.ఎస్.టి. అమలులోకి వచ్చే ముందు మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం జి.ఎస్.టి. వలన కోల్పోతామని, ఏటా సుమారు రూ.3,000 కోట్లు నష్టం వస్తుందని అన్నారు. దేశాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జి.ఎస్.టి.ని స్వాగతిస్తున్నామని కానీ దాని వలన రాష్ట్రాలు కేంద్రం ముందు చేతులు చాచే పరిస్థితి కల్పించకూడదని అన్నారు. ఈటెల చెప్పినది సహేతుకమే అని అర్ధం అవుతోంది. 

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాదన అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆయన సోమవారం ప్రగతి భవన్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో జి.ఎస్.టి.పై సమీక్షిస్తూ, జి.ఎస్.టి.వలన రాష్ట్రానికి లాభమే తప్ప నష్టం ఉండదని అన్నారు. జి.ఎస్.టి. వలన ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.2-3,000 కోట్లు ఆదాయం సమకూరుతుందని అన్నారు. పెట్రోలియం, మద్యం ఉత్పత్తులను జి.ఎస్.టి. నుంచి మినహాయించడం వలన వాటిపై వచ్చే ఆదాయంలో 50 శాతం యధాప్రకారం రాష్ట్రానికే అందుతుందని అన్నారు. మిగిలిన 50 శాతంలో కూడా రాష్ట్ర వాటాగా మరో 25శాతం కేంద్రం నుంచి తిరిగివస్తుందని అన్నారు. అంటే వాటిపై వచ్చే ఆదాయంలో 75శాతం రాష్ట్రానికే దక్కుతుందని అన్నారు. ఇక జి.ఎస్.టి.ద్వారా పెరిగిన ఆదాయంలో కూడా రాష్ట్రాలకు వాటా వస్తుందని అన్నారు. కనుక తెలంగాణా రాష్ట్రానికి జి.ఎస్.టి. వలన ఏటా అదనంగా రూ.2-3,000 కోట్లు ఆదాయం సమకూరుతుందని అన్నారు. 

ముఖ్యమంత్రి, ఆర్దికమంత్రులే జి.ఎస్.టి. ఆదాయంపై ఈవిధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే ఇక సామాన్యుల మాటేమిటి?