ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాంనాథ్ కోవింద్ మంగళవారం ఉదయం హైదరాబాద్ రానున్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి మీరా కుమార్ ఈరోజు హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టించుకోని తెరాస సర్కార్ రేపు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలుకడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. తెరాస ఆయనకు మద్దతు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆయనే రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నందున కాబోయే రాష్ట్రపతికి తగ్గట్లుగా స్వాగత సత్కారాలు చేయాలని తెరాస సర్కార్ భావిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జలవిహార్ కు వెళ్ళే మార్గంలో ఆయనకు స్వాగతం పలుకుతూ బారీ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఇతర మంత్రులు, తెరాస ఎంపిలు, భాజపా నేతలు విమానాశ్రయంలో అయనకు స్వాగతం పలుకుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జలవిహార్ లో ఆయనను కలిసి తమ పార్టీ మద్దతు ప్రకటిస్తారు.
అనంతరం రాంనాథ్ కోవింద్ విజయవాడ బయలుదేరి వెళతారు. గన్నవరం విమానాశ్రయంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, తెదేపా, భాజపా నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. చంద్రబాబు నాయుడు ఆయనకు విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటరులో తేనీటి విందు ఇస్తారు. అక్కడే ఆయన తనకు మద్దతు ఇస్తున్న పార్టీల ప్రజాప్రతినిధులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆయన సాయంత్రం డిల్లీ తిరిగివెళ్ళిపోతారు.