కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని కొద్దిసేపటి క్రితం సదాశివపేటలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను తెలంగాణా ప్రభుత్వం వెనక్కు తీసుకొనడాన్ని నిరసిస్తూ జగ్గారెడ్డి నేతృత్వంలో భూములు కోల్పోయిన ప్రజలు సదాశివపేట తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని, జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్ది సేపటి తరువాత విడిచిపెట్టారు.
అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సదాశివపేటలో మొత్తం 5,500 మంది పేదప్రజలకి ఇళ్ళు నిర్మించుకోవడానికి భూములిస్తే తెలంగాణా ప్రభుత్వం వాటిని వెనక్కు తీసుకొంది. వాటి కోసం మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అందుకే మేము పోరాటానికి సిద్దపదవలసి వచ్చింది. ఒకవేళ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మంగళవారం మేము కలెక్టరేట్ ను ముట్టడిస్తాము. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే మేమే భూములను స్వాధీనం చేసుకొంటాము. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెరాస సర్కార్ వారికోసం కొత్తగా చేసిందేమీ లేకపోయినా గత ప్రభుత్వం వారికి ఇచ్చిన భూములను గుంజుకోవడం చాలా దురదృష్టకరం. మళ్ళీ వారి భూములు వారికి తిరిగి ఇచ్చేవరకు వారి తరపున నేను ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాను” అని హెచ్చరించారు.