జి.ఎస్.టి. ఒక గాంబ్లింగ్: పొంగులేటి

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జి.ఎస్.టి. ఒక తమాషా అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే అదొక గాంబ్లింగ్ (జూదం) టాక్స్ విధానం అని టి కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అభివర్ణించారు. దాని వలన రైతులు, చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు కూడా జి.ఎస్.టి. వలన సామాన్య ప్రజలకు, వ్యాపారులకు, రైతులకు నష్టమే తప్ప ఏమాత్రం లాభం ఉండదని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

మోడీ సర్కార్ కార్పోరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకే జి.ఎస్.టి.ని తెచ్చిందని జీవన్ రెడ్డి అన్నారు. తెరాస దానికి సహకరించడం విచారకరమని అన్నారు. జి.ఎస్.టి. అమలులో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి అవలంభిస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, మద్యం విక్రయాలను జి.ఎస్.టి. పరిధిలోకి తీసుకురాకపోవడమే అందుకు నిదర్శనమని అన్నారు. కేంద్రప్రభుత్వం తనకు బారీగా ఆదాయం వచ్చే ఇటువంటి వాటిని జి.ఎస్.టి. నుంచి మినహాయించి, సామాన్య ప్రజలు, రైతులు, చిన్న చిన్న వ్యాపారులపై జి.ఎస్.టి.ని వడ్డించిందని జీవన్ రెడ్డి విమర్శించారు. 

జి.ఎస్.టి.పై దేశంలో అన్ని వర్గాలలో అనేక సందేహాలు, అపోహలు ఉన్నమాట నిజమే. వాటిని నివృతి చేయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. ఇక జి.ఎస్.టి.వలన దేశానికి మేలు కలుగుతుందో కీడే కలుగుతుందో కాలమే చెపుతుంది. జి.ఎస్.టి. వలన తెలంగాణా రాష్ట్రానికి ఏటా రూ.3,000 కోట్లు నష్టం వస్తుందని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా చెప్పారు. కనుక కేంద్రం ముందు రాష్ట్రాలు చెయ్యి చాచి నిలబడే దుస్థితి కల్పించవద్దని కేంద్రానికి ముందే విజ్ఞప్తి చేశారు. జి.ఎస్.టి.లో రాష్ట్రానికి రావలసిన వాటాను సకాలంలో ఇవ్వకపోతే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే జి.ఎస్.టి వలన పారిశ్రామికవేత్తలు, ఉత్పత్తిదారులు,వ్యాపారులు ఇకపై పన్ను ఎగవేయడానికి వీలుకాదని, కనుక కేంద్రం ఆదాయం పెరిగితే దానిని దేశాభివృద్ధికి, పేదప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని కేంద్రప్రభుత్వం చెపుతోంది. 

ఇంతకుముందు నోట్లరద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటపై నమ్మకం ఉంచే దేశప్రజలు, ముఖ్యంగా సామాన్య ప్రజలు అష్టకష్టాలను పంటి బిగువున భరించారు. నోట్లరద్దు వలన దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది చిన్న వ్యాపారులు నష్టపోయారు. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదు. వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. నేటికీ నోట్ల కష్టాలు అందరినీ వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు దేశప్రజలకు జి.ఎస్.టి. అనే మరో అగ్నిపరీక్ష ఎదుర్కోవలసి వస్తోంది. గత అనుభవాలను బట్టి చూసినట్లయితే మళ్ళీ అవే పరిస్థితులు పునరావృతం కావచ్చుననిపిస్తోంది. జి.ఎస్.టి.వలన దేశానికి మేలు కలిగితే అందరికీ సంతోషమే. కాకుంటే పొంగులేటి చెప్పినట్లు అది ఒక గాంబ్లింగ్ అవుతుంది. అది కాకులను కొట్టి గద్దలకు వేయడానికే అయితే వచ్చే ఎన్నికలలో ఎన్డీయే కూటమి అందుకు బారీ మూల్యం చెల్లించక తప్పదని మరిచిపోకూడదు.