మీడియాను బెదిరించడం తెరాసకు అలవాటే: భాజపా

తెలంగాణాలో జరిగిన రూ.15,000 కోట్ల భూకుంభకోణం వలన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన వార్తపై మంత్రి కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భాజపా మాజీ అధ్యక్షుడు ఎన్.ఇంద్రసేనా రెడ్డి కూడా స్పందించారు.

“మీడియా తన చెప్పు చేతలలో ఉంచుకోవాలనే తాపత్రయం తెరాసకు ఎప్పటి నుంచో ఉంది. గతంలో రెండు ప్రముఖ న్యూస్ ఛానల్స్ పై అప్రకటిత నిషేధం విధించింది. ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ పత్రిక భూకుంభకోణం గురించి వ్రాసిందని దానిపై విరుచుకు పడుతున్నారు. మియాపూర్ భూకుంభకోణం జరిగిన మాట వాస్తవమా కాదా? వాస్తవం అయితే తెర వెనుకున్న తెరాస నేతల పేర్లు బయటపెట్టమని అందరూ ప్రశ్నిస్తుంటే తెరాస సర్కార్ ఎందుకు జవాబు చెప్పడం లేదు? ఇంతపెద్ద కుంభకోణం బయటపడితే తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించకుండా గజం భూమి కూడా పోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వాదిస్తున్నారు?ఎస్.కె. సిన్హా కమిటీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు? ప్రస్తుతం మీరే అధికారంలో ఉన్నారు కనుక గత ప్రభుత్వాలు అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నప్పుడు దోషులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?" అని ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు.