ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్ జూన్ 29వ తేదీ సంచికలో తెలంగాణా రాష్ట్రంలో రూ.15,000 కోట్ల భూకుంభకోణం జరిగిందని, దాని వలన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణాలో తమ అధీనంలో ఉన్న భూముల విషయంలో సందిగ్ధంలో పడ్డాయని ఒక వార్త ప్రచురించింది. అటువంటి నిరాధారమైన వార్త ప్రచురించి తెలంగాణా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసినందుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ ఆ పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎకనామిక్ టైమ్స్ పత్రిక మొదటి నుంచి కూడా తెలంగాణా రాష్ట్రం, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనబరుస్తూనే ఉంది. తెలంగాణా ఏర్పడిన కొత్తలో హైదరాబాద్ నుంచి ఏకంగా 700 సంస్థలు ఏపికి తరలివెళ్ళిపోబోతున్నాయని ప్రచురించింది. కానీ రాష్ట్రం నుచి ఒక్క కంపెనీ కూడా ఎక్కడికి తరలివెళ్ళలేదు పైగా ఆపిల్, మైక్రో సాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఊబర్ వంటి అనేక పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ కు తరలివచ్చాయి. ఎప్పుడో పదేళ్ళ క్రిందట జరిగిన భూకుంభకోణం ప్రస్తావిస్తూ అది ఇప్పుడే జరిగినట్లు, ఆ ప్రభావంతో మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలపై పడినట్లు వ్రాయడం చాలా దారుణం. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఆ పత్రిక తెలంగాణా రాష్ట్రానికి ఎంత హాని చేస్తోందో గుర్తించడం లేదు.
అసలు ఆ పత్రికకు తెలంగాణాపై అంత వ్యతిరేకత ఎందుకో అర్ధం కాదు. తెలంగాణా ఉద్యమాల సమయంలో అనేక పత్రికలూ, టీవీ ఛానళ్ళు ఉద్యమాలను వ్యతిరేకిస్తూ కధనాలు వ్రాసి, ప్రసారం చేసినప్పటికీ ఆ తరువాత వాటిలో చాలా వరకు తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమ ఆలోచనా వైఖరిని మార్చుకొన్నాయి. అందుకు ఇష్టపడని మీడియా మౌనంగా ఉండిపోయింది తప్ప ఈవిధంగా తెలంగాణా రాష్ట్రంపై పనికట్టుకొని దుష్ప్రచారం చేయడం లేదు.
పత్రికా స్వేచ్చ పేరిట మీడియా ఇష్టం వచ్చినట్లు నిరాధారమైన ఆరోపణలతో వార్తలు, కధనాలు ప్రచురించడం సరికాదు. ఏదైనా విమర్శ, ఆరోపణ చేస్తే అవి సహేతుకంగా ఉండాలి. హైదరాబాద్ కు ఏవైనా పెద్ద పరిశ్రమలు తరలివస్తే ఎకనామిక్ టైమ్స్ హైదరాబాద్ కరస్పాండెంట్ కనబడరు. కానీ రాష్ట్రంపై కక్ష కట్టినట్లు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కధనాలు వ్రాసి పడేస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదు,” అని కేటిఆర్ అన్నారు.