ఇక్కారెడ్డిగూడ గ్రామంలో బోరుబావిలో పడి చిన్నారి మృతి చెందిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. జూలై 10వ తేదీలోగా రాష్ట్రంలో నీళ్ళుపడని అన్ని బోరుబావులను పూడ్చివేయడం లేదా మూతలు బిగించాలని లేకుంటే సదరు యజమానులపై కేసులు నమోదు చేసి రూ.50,000 వరకు జరిమానాలు కూడా విధిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
రాష్ట్రంలో కేవలం 250 రిగ్గులకు మాత్రమే అనుమతి ఉందని కానీ అనుమతిలేనివి కొన్ని వందలు ఉన్నట్లు గుర్తించామని, కనుక వారందరూ విధిగా రిజిస్టర్ చేసుకొని, బోరుబావులు త్రవ్వడానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
బోరుబావులు త్రవ్వడానికి అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, వి.ఆర్.ఒ.లకు అప్పగించబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై వారే తమతమ గ్రామాలలో బోరుబావుల త్రవ్వకాలను, నీళ్ళు పడని వాటిని పూడ్చివేయించడం వంటి పనులను పర్యవేక్షించవలసి ఉంటుందని అన్నారు. తమ గ్రామపరిధిలో ఎన్ని బోరుబావులున్నాయి..వాటిలో నీళ్ళు వస్తున్నవెన్ని..నీళ్ళు పడనివెన్ని..వాటి యజమానులు ఎవరు? ఆ బోరుబావులను త్రవ్విన సంస్థ పేరు, వివరాలు, దానికి ఇచ్చిన అనుమతులు వగైరా సమగ్ర సమాచారం అంతా వారు నిర్వహించవలసి ఉంటుందని చెప్పారు. త్వరలోనే బోరుబావుల త్రవ్వకాలపై మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.