తెలంగాణా రైతాంగానికి శుభవార్త! గత ఐదేళ్ళలో మొట్టమొదటిసారిగా శ్రీరాంసాగర్ రిజర్వాయర్ (ఎస్.ఆర్.ఎస్.పి.)లోకి సోమవారం ఒకే రోజున ఏకంగా 2500 క్యూసెక్కుల నీళ్ళు వచ్చి చేరాయి. ఎగువనున్న మహారాష్ట్రాలో బారీగా వర్షాలు పడుతుండటంతో వర్షాకాల ఆరంభంలోనే ఈ ప్రాజక్టులోకి బారీగా నీళ్ళు వచ్చి చేరాయి. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 1055 అడుగులు కాగా అప్పుడే అది 1091 అడుగులకు చేరుకొంది. చాలా ఏళ్ళ తరువాత నిండు కుండలా నీళ్ళతో కళకళలాడుతున్న రిజర్వాయర్ ను చూసి రైతులు అందరూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.
తెలంగాణాలో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ మరియు ఖమ్మం జిల్లాలకు శ్రీరాంసాగర్ రిజర్వాయర్ చాలా కీలకమైనది. కానీ గత కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వలన దానిలోకి ఈస్థాయిలో నీరు వచ్చి చేరలేదు. వర్షాకాలం మొదట్లోనే దాదాపు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నీరు నిండటం ఇదే మొదటిసారి. కనుక దానిపై ఆధారపడిన జిల్లాలలో ఈసారి పంటలకు కావలసినంత నీళ్ళు అందే అవకాశం ఉంది. ఈ మూడేళ్ళ కాలంలో ప్రభుత్వం చేపట్టిన కొన్ని మైనర్, మేజర్ ఇరిగేషన్ పనుల వలన ఈ ప్రాజెక్టు క్రింద సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఈసారి దానిని 22 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.