తెరాస సర్కార్ కు హైకోర్టులో ఊరట

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని ఆత్రుత పడుతున్న తెరాస సర్కార్ కు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఒకటి. చెన్నైలో గల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానిపై వచ్చిన పిర్యాదులపై స్పందిస్తూ ఒక కమిటినీ ఏర్పాటు చేసింది. అది క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తుందని అంత వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. తెరాస సర్కార్ దానిపై హైకోర్టులో అప్పీలు చేసుకొంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవాలని రాజకీయ దురుదేశ్యాలతో కొందరు వేసిన పిటిషన్లను పరిగణనలోకి తీసుకొన్న ట్రిబ్యునల్ ఈవిధంగా ప్రజపయోగ పనులను నిలిపివేయడం సరికాదన్న తెరాస సర్కార్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టి వేసింది. దీంతో తెరాస సర్కార్ ఉపశమనం లభించినట్లయింది. లేకుంటే దీనికోసం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవలసి వచ్చేది. అది విచారణ చేపట్టి తీర్పు చెప్పేసరికి మరికొన్ని నెలలు గడిచిపోతాయి కనుక ప్రాజెక్టు పనులు నిలిచిపోయేవి. ఈ ప్రాజెక్టులో అవరోధాన్ని హైకోర్టు తొలగించింది. కానీ ఇంకా కొన్ని గ్రామాలలో భూసేకరణ ప్రక్రియ పూర్తికావలసి ఉందని సమాచారం. ఆ పనులు కూడా పూర్తయితే ఇక నిర్మాణపనులు వేగవంతం చేయవచ్చు.