నామినేషన్ వేసిన మీరా కుమార్

కాంగ్రెస్, మిత్రపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో సహా ఆమెకు మద్దతు ఇస్తున్న వివిడ్ పార్టీల నేతలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె రేపటి నుంచి దేశంలో అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తూ వివిధ పార్టీల మద్దతు కూడగట్టుకొనేందుకు ప్రయత్నిస్తారు. అ ప్రయత్నాలలో భాగంగానే ఆమె జూలై 3వ తేదీన హైదరాబాద్ రానున్నారు.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు తప్ప మిగిలిన అన్ని పార్టీలు రాంనాథ్ కోవింద్ కే మద్దతు పలుకుతున్నందున ఆమెకు మద్దతు లభించే అవకాశం లేదు. మజ్లీస్ పార్టీ భాజపాను వ్యతిరేకిస్తుంది కనుక అది ఆమెకు మద్దతు ఈయవచ్చు. ఇక ఆంధ్రలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ తెదేపా, వైకాపాలు రెండూ రాంనాథ్ కోవింద్ కే మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు ఆమెకు మద్దతు పలికినా ప్రయోజనం లేదు. తమిళనాడులో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. దక్షిణాదిన కర్నాటక, కేరళ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కనుక ఆమెకు పూర్తి మద్దతు లభిస్తుంది.

ఎన్డీయే అభ్యర్ధికి రాంనాథ్ కోవింద్ ఇప్పటికే 62 శాతం ఎలక్ట్రాల్ ఓట్లు మద్దతు లభించింది కనుక ఈ ఎన్నికలలో ఆయనే విజయం సాధించడం ఖాయం. ఈ సంగతి మీరా కుమార్ కు కూడా తెలుసు. కానీ రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అవకాశం లభించడం కూడా గొప్ప విషయమే కనుక ఆమె బరిలో దిగారని భావించవచ్చు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి తన ప్రచారం మొదలుపెడతానని ప్రకటించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ ఈనెల 23వ తేదీన నామినేషన్ వేసిన వెంటనే రాష్ట్ర పర్యటనలకు బయలుదేరారు. ఆయన కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారు.