ఉద్యమ స్పూర్తితో పాలనను మార్చుతాం!

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఈ నెల 21-24 వరకు చేపట్టిన తెలంగాణా అమరవీరుల స్ఫూర్తి యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనపై మంగళవారం జెఎసి స్టీరింగ్ కమిటీ చర్చించింది. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ప్రజలందరి త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణా ఏర్పడితే మన కష్టాలు తీరిపోతాయని అందరూ అనుకొన్నారు. కానీ మూడేళ్ళు అవుతున్నా పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వంలో అవినీతి, ప్రభుత్వ పనులలో అవినీతి, అక్రమాలు, అవకతవకలు ప్రభుత్వ శాఖలలో అవినీతి, ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోంది. ప్రభుత్వ పధకాలన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప అర్హులైన పేదలకు అందడం లేదు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల దృష్టి ఎంతసేపు కాంట్రాక్టులు దక్కించుకోవడంపైన లేదా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమీషన్లు సంపాదించుకోవడంపైనే ఉంటుంది తప్ప తమతమ నియోజక వర్గాలలో ప్రజాసమస్యలను అసలు పట్టించుకోవడం లేదు. ఆ కారణంగా ప్రభుత్వ అధికారులలో కూడా అలసత్వం, అవినీతి పెరిగిపోయింది. రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా రకరకాల మాఫియాలు వ్యవస్తీకృతం కావడం చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం నాలుగవ విడత పంట రుణాల మాఫీ కోసం నిధులు విడుదల చేశామని చెప్పుకొంటుంది. కానీ అవి ఇంతవరకు బ్యాంకులలో రైతుల ఖాతలలోకి చేరనేలేదు. దీంతో బ్యాంకులు రైతులను పీడిస్తున్నాయి.

ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టాలనుకొంటున్న భూములలో బీటలు ఉన్నాయి కనుక అవి అటువంటి బారీ ప్రాజెక్టుకు అనుకూలమైనవి కావు. కానీ ప్రభుత్వం మొండిగా అక్కడే ఆ ప్రాజెక్టు కడితే మున్ముందు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక దీనిపై ముందుకు సాగేముందు నిపుణుల సలహాలు తీసుకొంటే మంచిది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో అధికారపార్టీ నేతల జోక్యం చాలా ఎక్కువైపోయింది. ఈ మూడేళ్ళలో అనేకమంది పోలీస్ అధికారులు ఆత్మహత్యలు చేసుకోవడమే అందుకు ఉదాహరణ. ఈ ప్రభుత్వ పాలన ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. దానిని ఉద్యమస్పూర్తితో తప్పకుండా మార్చితాము,” అని అన్నారు.