యూపియే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మీరా కుమార్ ఈ ఎన్నికల గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మంగళవారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అందరూ భావిస్తున్నట్లు ఈ ఎన్నికలు ఇద్దరు దళితుల మద్య జరుగుతున్న పోరాటం కాదు. ప్రజాస్వామిక విలువలు, సామాజిక న్యాయం, కులవ్యవస్థ నిర్మూలన మొదలైన వాదనల మద్య జరుగుతున్న పోరాటం మాత్రమే. దేశంలో కులవ్యవస్థను భూమిలో పూడ్చిపెట్టవలసిన అవసరం ఉంది. దళితులపై జరుగుతున్న దాడులు చాలా బాధాకరం. నేను లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు నా పనితీరును పార్టీలకు అతీతంగా ఎంపిలు అందరూ మెచ్చుకొన్నారు. కనుక ఈ ఎన్నికలలో అందరూ నాకే ఓటువేసి గెలిపిస్తారని భావిస్తున్నాను. నేను అభిమానించే గాంధీజీ నివసించిన గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి నా ఎన్నికల ప్రచారం మొదలుపెడతాను,” అని అన్నారు.
మీరా కుమార్ కుల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆమెను ఆమె కులం కారణంగానే ఈ పదవికి పోటీ చేసేందుకు యూపియే ఎంపిక చేసిందని అందరికీ తెలుసు. ఎన్డీయే కూటమి రాంనాథ్ కోవింద్ ను తమ అభ్యర్ధిగా నిలబెట్టి ఆయన దళితడని ప్రచారం మొదలుపెట్టగానే, దళిత వర్గానికి చెందిన మీరా కుమార్ అయితేనే ఆయనను సమర్ధంగా ఎదుర్కోగలరనే కారణం చేతే యూపియే కూటమి ఆమెను అభ్యర్ధిగా ఎంచుకొంది. కులం కారణంగానే ఈ అవకాశం దక్కించుకొన్న ఆమె కులవ్యవస్థను వ్యతిరేకిస్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. యూపియే, ఎన్డీయే కూటములు ఇప్పుడు వారి కులాల గురించి బయటకు మాట్లాడకపోయినా అదే ఆధారంగా ఈ ఎన్నికలు జరుగబోతున్నాయనే సంగతి అందరికీ తెలుసు.