కలెక్టర్ వినూత్న ఆలోచన!

గత ప్రభుత్వాల హయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, తాము అధికారంలోకి వస్తే అవినీతిని ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పి భాజపా అధికారంలోకి రాగలిగింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రభుత్వ కార్యాలయాలలో ఆకస్మిక పర్యటనలు చేస్తూ చాలా హడావుడి చేశారు. కానీ ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి ఏమాత్రం తగ్గకపోగా ఇంకా పెరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, పౌరసరఫర శాఖలలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమంత్రి యోగి కూడా అవినీతిని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేనిదారి దానిదే అన్నట్లు సాగిపోతున్నాయి. 

దీంతో ఫరూకాబాద్ జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ అవినీతిని అరికట్టడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే.. జైలు టూరిజం. తన జిల్లాలో అవినీతి ఎక్కువగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులను, అధికారులను జైళ్ళకు పంపించి, లోపల పరిస్థితులు ఏవిధంగా  ఉంటాయో, లోపల ఖైదీలు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, లంచం తీసుకొన్న నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్నవారు ప్రస్తుతం ఎటువంటి శిక్షలు అనుభవిస్తున్నారో స్వయంగా కళ్ళారా చూసి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం అవి చూసిన తరువాతైనా భయంతో అధికారులు అవినీతి , అక్రమాలకు దూరంగా ఉంటారని కలెక్టర్ భావిస్తున్నారు. జైలు జీవితం ఏవిధంగా ఉంటుందో కాస్త రుచి చూపించడం మంచిదే. లోపలకు వెళ్ళి వచ్చిన తరువాత లంచం కోసం చెయ్యి చాపే ముందు ఒకసారి ఆలోచించుకొంటారు.