రంగారెడ్డి జిల్లా ఎక్కారెడ్డిగూడలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిపోయిన 16 నెలల చిన్నారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడం ఆ చిన్నారి ఇంకా బోరుబావిలోనే ఉండిపోయింది. ఆ చిన్నారి ఇంకా క్రిందకు జారిపోవడంతో ఇప్పుడు రిమోట్ కెమేరాకు కూడా కనబడటం లేదు. ఆ పాప ఇంకా సజీవంగా ఉందో లేదో తెలియదు. బోరు బావి నుంచి పాపను బయటకు తీయడానికి ఆధునిక పద్దతులేవీ పలించకపోవడంతో మళ్ళీ పొక్లేయిన్లతో బోరుకు సమాంతరంగా త్రవ్వుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 70 అడుగుల లోతు వరకు మాత్రమే త్రవ్వగలిగారు. మరో 100-125 అడుగులు లోతుకు వెళితేకానీ పాప దగ్గరకు చేరుకోలేరు. కానీ బోరు ఉన్న ప్రాంతంలో రాయి పడటంతో తవ్వకం పని చాలా మెల్లగా జరుగుతోంది.
ఓ.ఎన్.జి.సి. మరియు ఎల్ అండ్ టి సంస్థల ప్రతినిధులు ఈరోజు ఉదయం అక్కడికి చేరుకొని బోరు బావి నుంచి పాపను బయటకు తీయడానికి వేరే మార్గాలు ఉన్నాయా లేవా అని పరిశీలించబోతున్నారు. వారివద్ద గంటకు వంద అడుగుల లోతు త్రవ్వగల భారీ యంత్రాలున్నప్పటికీ వాటిని అక్కడ వినియోగించడం సాధ్యం కాదని సమాచారం.
పాప బోరులో పడి ఇప్పటికే 40 గంటలు కావస్తోంది. ఇంతవరకు ఆక్సిజన్ తప్ప పాలు, నీళ్ళు వంటివి కూడా అందించడం సాధ్యం కాలేదు. కనుక ఆ చిన్నారి ఆ బోరుబావిలో ఎంత నరకం అనుభవిస్తోందో ఎవరూ ఊహించలేరు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంఘటనను ఒక గుణపాఠంగా భావించి, యుద్దప్రాతిపదికన తెరిచి ఉన్న బోర్లన్నిటికీ మూతలు బిగించగలిగితే మళ్ళీ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.