వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మె శనివారంతో 10వ రోజుకు చేరుకొంది. సింగరేణి కార్మిక సంఘాల నేతలతో సింగరేణి యాజమాన్యం శుక్రవారం చర్చలు జరిపింది కానీ అవి విఫలం అయ్యాయి. వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. అనంతరం సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల కార్మికులు ఊరేగింపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్ళి సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ వైఖరికి నిరసనలు తెలియజేశారు.
కొత్తగా స్థాపించిన ‘తెలంగాణా ఇంటి పార్టీ’ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ వారికి మద్దతు పలికారు. ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెరాస అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం కార్మికుల ఫైల్ పైనే చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక సింగరేణి కార్మికుల పట్ల చాలా చులకనగా వ్యవహరిస్తున్నారు. పైగా గుర్తింపు పొందిన కార్మిక సంఘం పేరుతో దుష్టరాజకీయలు చేస్తూ కార్మికుల మద్య చిచ్చు పెడుతున్నారు. సింగరేణి కార్మికులకు తప్పనిసరిగా వారసత్వ ఉద్యోగాలు కల్పించవలసిందే. సమ్మె చేస్తున్న కార్మికులకు తెలంగాణా ఇంటి పార్టీ అండగా ఉంటుంది,” అని అన్నారు.
సింగరేణిలో రాజుకొన్న ఈ సమస్యతో ఇప్పటికే పరిస్థితులు క్లిష్టంగా మారాయి. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో సహా రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ వారి సమ్మెకు మద్దతు ప్రకటించడంతో సమ్మె ఇంకా ఉదృతం అయింది. ఇప్పుడు ఆ అగ్గిని తెలంగాణా ఇంటి పార్టీ కూడా రాజేస్తోంది. అది రాజకీయ పార్టీ కనుక తన ఉనికిని చాటుకొనేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకోవడం సహజమే కానీ అన్ని పార్టీలు కలిసి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేయకుండా కార్మికులను ఈవిధంగా రెచ్చగొట్టడం సరికాదు. దాని వలన కార్మికులు, సంస్థ నష్టపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయడం చాలా అవసరం.