ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రికలుగా చెప్పుకోవలసిన పధకాలు చాలానే ఉన్నాయి. వాటిలో స్మార్ట్ సిటీ, స్వచ్చా భారత్ వంటివి అనేకం ఉన్నాయి. దేశంలో 100 నగరాలను సకల ఆధునిక సౌకర్యాలు కలిగి ఉన్న స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని మోడీ సంకల్పించారు. వాటిలో తెలంగాణా రాష్ట్రంలో ఎంపికైన వాటిలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఉన్నాయి. వీటి ఎంపిక కోసం కేంద్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. వాటిలో అర్హత పొందిన పట్టణాలు లేదా నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం బారీగా నిధులు కేటాయిస్తుంది. దానితో విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం, ఇతర మౌలికవసతులు, అత్యాధునిక సౌకర్యాల కల్పన వంటివి ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఎంపిక చేసిన నగరాలు, పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే విదేశీ సంస్థల సహాయసహకారాలు కూడా తీసుకోవచ్చు. తెలంగాణా రాష్ట్రంలో ఎంపిక చేసిన హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఈ మూడేళ్ళలో జరుగుతున్న అభివృద్ధిపనులు అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు కరీంనగర్ కూడా ఎంపిక అయ్యింది కనుక శరవేగంగా అభివృద్ధి చేయబడుతుంది.
స్మార్ట్ సిటీలతో బాటు మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల కోసం అమృత్ అనే మరో పధకం కూడా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పధకానికి కూడా వేరేగా మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. వాటిలో అర్హత పొందిన వాటికి కేంద్రప్రభుత్వం బారీగా నిధులు మంజూరు చేస్తుంది. ఈ పధకం క్రింద తెలంగాణాలో ఎంపికయిన పట్టణాల పేర్లు: ఖమ్మం, రామగుండం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ మున్సిపాలిటీలు, జి.హెచ్.ఎం.సి., కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్లు.