రంగారెడ్డి జిల్లాలో గురువారం సాయంత్రం సుమారు 6.30 గంటలకు బోరుబావిలో పడిపోయిన చిన్నారిని రక్షించేందుకు ఎన్జీఎఫ్., తదితర బృందాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మొదట 50-60 అడుగుల లోతులో ఆ పాప సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను ఒక ప్రత్యేక పరికరం ద్వారా బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆ తరువాత ఇటువంటి పనులలో నిపుణుడైన నల్లగొండ జిల్లాకు చెందిన కరుణాకర్ బృందం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ తరువాత బోరులో ఉన్న మోటారును పైకి తీసేందుకు ప్రయత్నించగా మోటారు పైకి వచ్చింది కానీ పాప మాత్రం పైకి రాలేదు. అన్ని ప్రయత్నాలు విఫలం అవడంతో మళ్ళీ ఆ బోరుబావి పక్కన సమాంతరంగా పొక్లేయిన్లతో తవ్వడం మొదలుపెట్టారు.
ఈరోజు 5గంటల సమయానికి కేవలం 25 అడుగుల లోతువరకు మాత్రమే త్రవ్వగలిగారు. పాప ఇప్పుడు సుమారు 120 అడుగుల లోతుకు జారిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కనుక పాపను బయటకు తీయాలంటే 120 అడుగుల కంటే కొంచెం ఎక్కువ లోతు వరకు త్రవ్వవలసి ఉంటుంది. కానీ అంత లోతు త్రవ్వడానికి కనీసం 3-4 రోజులు పడుతుందని అధికారులు చెపుతున్నారు. ఇంతకు ముందు పాప సజీవంగా ఉన్నట్లు ఆనవాలుగా లోపల నుండి పాప ఏడుపు గొంతు వినపడేది. కానీ ఇప్పుడు 120 అడుగుల లోతుకు జారిపోవడంతో ఎటువంటి సంకేతాలు లేవు. పైగా ఇప్పుడు పాప పడిపోయిన ఇక్కారెడ్డిగూడెంలో చిన్నగా వాన కూడా మొదలైంది. బోరులోకి వాన నీరు వెళ్ళకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. కానీ పాప ఇక ప్రాణాలతో బ్రతికి బయటపడటం దాదాపు అసంభవమేనని అధికారులు భావిస్తున్నారు. అయినా తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెపుతున్నారు.
తమ నియోజకవర్గంలోనే ఇటువంటివి మూతలు లేని బోరుబావులు సుమారు 30,000 వరకు ఉంటాయని స్థానికులు చెపుతున్నారంటే, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, గ్రామపెద్దలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. వారందరి నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని ఒక చిన్నారి అతిభయానకమైన పరిస్థితులలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి మూతలు లేని బోరుబావులను మూసివేసేందుకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు అన్నీ చొరవతీసుకోవాలి.