సింగరేణిలో ఉద్రిక్తవాతావరణం

ఈనెల 15వ తేదీ నుంచి సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల కార్మికులు వారసత్వ ఉద్యోగాలు కోరుతూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. నేటికి సమ్మె మొదలయ్యి వారంపైనే అయినా ఇంతవరకు ప్రభుత్వం కానీ యాజమాన్యం గానీ కార్మిక సంఘాలతో చర్యలకు రాలేదు. ఒక పక్క కొన్ని కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు సమ్మె చేస్తుండగా మరోపక్క తెరాస అనుబందంగా ఉన్న గుర్తింపు పొందిన కార్మిక సంఘం కార్మికులు యధాప్రకారం పనిచేస్తుండటంతో ఆ రెండు వర్గాల కార్మికుల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. 

ఇదే సమయంలో రామగుండం ఓసిపి 3లో డంపర్ డ్డీ కొట్టడంతో ఓవర్ హెడ్ మ్యాన్ గా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ అనే కార్మికుడు గురువారం మృతి చెందాడు. అతని శవాన్ని పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖని సింగరేణి ఆసుపత్రికి తీసుకురావడంతో, అక్కడ ఇరువర్గాల కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 

సమ్మె జరుగుతున్నపటికీ సింగరేణిలో ఉత్పత్తికి ఏమాత్రం ఆటంకం కలుగలేదని, యధాప్రకారం బొగ్గు ఉత్పత్తి జరిగిపోతోందని చూపించేందుకే యాజమాన్యం కార్మికులమీద ఒత్తిడి తెచ్చి వారిచేత బలవంతంగా పని చేయిస్తునందునే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, రాజేంద్ర ప్రసాద్ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని సమ్మె చేస్తున్న కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం తన  మొండివైఖరి మానుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సమ్మె చేస్తున్న కార్మికు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. తమపై బెదిరింపులకు పాల్పడినంత మాత్రాన్న భయపడి సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు.