సీనియర్ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకొనేందుకు పడుతున్న ఆరాటం చూస్తుంటే నవ్వొస్తుంది. కేంద్రప్రభుత్వం తమ రాష్ట్రపతి అభ్యర్ధి పేరును ప్రకటించక మునుపే వారిరువురూ మద్దతు ఇస్తామని ప్రకటించేశారు. అలాగే జి.ఎస్.టి. వస్తే ఎరువులపై పన్నులు పెరుగుతాయి. దాని వలన రైతులకు చాలా నష్టం జరుగుతుందని వారికి తెలిసినా దానిని ఇద్దరు ముఖ్యమంత్రులు గుడ్డిగా సమర్ధిస్తున్నారు. వారికి తమ రాష్ట్రాలలో రైతుల సమస్యలను పరిష్కరించే ఓపిక, ఆసక్తి రెండూ లేవు కానీ భాజపా రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించడానికి ఇద్దరూ పోటీలు పడుతుంటారు. ఇదంతా దేనికంటే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో పడటానికే,” అని అన్నారు.
ఇరువురు ముఖ్యమంత్రులను విమర్శిస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి తమ పార్టీ అధినేత సోనియా గాంధీ కూడా ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్ధి మీరా కుమార్ ను గెలిపించుకొనేందుకు ప్రతిపక్ష పార్టీలను కూడగట్టేపనిలో ఉన్నారనె సంగతి తెలియనట్లు మాట్లాడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్ధికి కేసీఆర్ మద్దతు ఇచ్చి ఉండి ఉంటే అప్పుడు కూడా పొంగులేటి ఈవిధంగానే మాట్లాడి ఉండేవారా? అంటే కాదనే చెప్పవచ్చు. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు కేంద్రంతో, ప్రధాని నరేంద్ర మోడీతో సఖ్యతగా ఉండటం నేరం కాదు కదా?కనుక రాష్ట్రపతి ఎన్నికలను మోడీని ప్రసన్నం చేసుకోవడంతో ముడిపెట్టి మాట్లాడటం సరికాదనే చెప్పాలి.